చెత్తకుప్పల్లో.. ఆర్టీసీ ఆస్తులు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ సంస్థకు చెందిన కోట్ల రూపాయలు విలువచేసే ఆస్తులు చెత్తకుప్పల్లో మూలుగుతున్న పరిస్థితి నెలకొంది.

Update: 2024-11-10 02:54 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ సంస్థకు చెందిన కోట్ల రూపాయలు విలువచేసే ఆస్తులు చెత్తకుప్పల్లో మూలుగుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడి స్థలంలో ఆర్టీసీ కార్మికులకు చెందిన గృహాలు, డిపో ఉండేది. అయితే గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని కూల్చివేసిన తర్వాత ఖాళీ స్థలం ఏర్పడింది. విలువైన స్థలాన్ని వినియోగించుకోకుండా ఆర్టీసీ యాజమాన్యం నిరుపయోగంగా వదిలేసిందని, ఏడాదికి ఒకసారి మాత్రం ఎగ్జిబిషన్ నిర్వాహకులకు ఇస్తోందని స్థానికులు చెబుతున్నారు. స్థలం ఖాళీగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలు జరగడంతో పాటు కొందరు చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తుండటంతో పందులు, కుక్కలు సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏండ్లుగా ఖాళీగా దర్శనమిస్తుండటంతో ఈ స్థలాల పై కబ్జాదారుల కన్ను పడింది. ఇప్పటికే కొంత స్థలం కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయ వనరును నిర్లక్ష్యంగా వదిలేయడం పట్ల ఆర్టీసీ యాజమాన్యం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ సంస్థకు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు చెత్తకుప్పల్లో మూలుగుతున్న పరిస్థితి నెలకొంది. గత కొన్నేండ్లుగా ఆర్టీసీ ఆస్తులు నిరుపయోగంగా ఉండటం మూలంగా కేవలం చెత్త వేసుకునేందుకు ఉపయోగపడటం దారుణం. గతంలో ఇక్కడి స్థలంలో ఆర్టీసీ కార్మికులకు చెందిన గృహాలు డిపో ఉండేది. అయితే గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని కూల్చివేసిన తర్వాత ఏండ్ల తరబడి ఖాళీ స్థలం అలానే ఉండిపోయింది. అక్కడున్న డిపోను సైతం ఆర్టీసీ బస్టాండ్ పక్కకు మార్చడం జరిగింది.

దీంతో ఇక్కడి కాళీ స్థల ప్రాంతం పాత బస్ డిపో ఏరియాగా ముద్ర పడిపోయింది. ఈ తతంగమంతా జరిగి ఏండ్లు గడుస్తున్నా ఖాళీ స్థలాన్ని మాత్రం ఆర్టీసీ యాజమాన్యం ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా వదిలేసినట్లుగా సమీపంలో ఉన్న కొంతమంది చెబుతున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రం ఖాళీ స్థలాన్ని ఎగ్జిబిషన్ నిర్వాహకులకు యాజమాన్యం ఇస్తోంది. ఎగ్జిబిషన్ సీజన్ అయిపోయిన తర్వాత స్థలం నెలల తరబడి నిరుపయోగంగా ఉండటం మూలంగా ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగడంతో పాటు కొందరు చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేయడంతో పందులు కుక్కలు సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఆర్టీసీ యాజమాన్యం పూర్తిస్థాయిలో ఎందుకు వినియోగించుకోలేక పోతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆదాయ వనరులను ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుంటే సంస్థకు ఆదాయం రావడంతో పాటు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని పలువురు సూచిస్తున్నారు.

ఖాళీ స్థలం పై కన్ను..

ఇటు శ్రీనగర్ గ్రామపంచాయతీకి అటు మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్న ఆర్టీసీ పాత బస్ డిపో ఆస్తులు కొన్ని సంవత్సరాల తరబడి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కారణంగా ఈ స్థలాల పై కబ్జాదారుల కన్ను పడింది. ఇప్పటికే కొంత స్థలం కబ్జాకు గురైనట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. స్థలాలను నిరుపయోగంగా వదిలేయకుండా అందులో షాపింగ్ కాంప్లెక్స్ లేదా ఆర్టీసీ ఏకో పార్కును ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంత ఉపయోగంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

కళ్యాణ మండపంగా మార్చాలి.. 23వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి

ఇటు మున్సిపాలిటీ అటు శ్రీనగర్ గ్రామపంచాయతీకి అనుకొని ఉన్న పాత బస్ డిపో ఖాళీ స్థలాన్ని కల్యాణ మండపంగా మార్చాలి. ఖాళీ స్థలం నిరుపయోగంగా ఉంచడంతో ఆర్టీసీ సంస్థకు నష్టం తప్ప లాభం లేదు. కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంతో అభివృద్ధికి ఖర్చు చేసుకోవచ్చు. ఆ దిశగా యాజమాన్యం ఆలోచించి చర్యలు తీసుకోవాలి.

ఖాళీ స్థలాన్ని ఎగ్జిబిషన్ వారికి ఇచ్చాం.. దేవేందర్, డిపో మేనేజర్

పాత బస్ డిపో ఖాళీ స్థలాన్ని ఎగ్జిబిషన్ వారికి లీజుకు ఇచ్చాం. ఆర్టీసీ స్థలంలో ఉన్న బిల్డింగ్‌ను సైతం ఒక స్కూల్ యాజమాన్యానికి అద్దెకు ఇచ్చాం. ఇరువురు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఉపయోగించుకునేందుకు ముందుకు రాలేదు. ఆర్టీసీ ఖాళీ స్థలాలను ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.


Similar News