మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ అధిష్టానం ఏమైనా స్పష్టత ఇచ్చిందా? వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అవకాశం లభిస్తుందా? అందుకే యాక్టివ్ అయ్యారా? సీఎం జిల్లా పర్యటన అనంతరం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారా? ఈ నేపథ్యంలోనే ఆదివారం తన స్వగ్రామమైన గండుగులపల్లిలో అధికారులను పిలిపించుకుని మరీ ‘సీతారామ’ ప్రాజెక్టుపై దిశానిర్దేశం చేశారా? మంత్రి హరీశ్ రావుతో కూడా డిస్కస్ చేశారా? అంటే అవుననే అంటున్నారు.. తుమ్మల సన్నిహితులు. రానున్న రోజుల్లో పెద్దాయనకు మంచిరోజులేనని సంబర పడుతున్నారు. జిల్లాలోని మిగతా నాయకులు తుమ్మల చేసిన ఈ సమీక్ష విషయంలో చెవులు కొరుక్కుంటున్నారట..
దిశ ఖమ్మం, బ్యూరో: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ షురూ చేశారు. కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న సీనియర్ నేత.. ఇటీవల జరిగిన పలు పరిణామాలతో మళ్లీ తెరపైకి వచ్చారు. దీంతో మళ్లీ పార్టీ పెద్దల ముందు తన ప్రాధాన్యత నిలుపుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి హోదా లేకున్నా.. అధికారులతో రివ్యూలు చేస్తూ చర్చనీయాంశం అవుతున్నారు.. అసలే ఖమ్మం అధికార పార్టీ వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నది. సీనియర్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అధిష్టానానికి తలనొప్పులు తెస్తుంటే.. కొన్ని నియోజకవర్గాలో బీఆర్ఎస్ నుంచే ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండగా.. ఎలాంటి హోదా లేని తుమ్మల మాత్రం జిల్లా ఇరిగేషన్ అధికారులను ఇంటికి పిలిపించుకుని మరీ రివ్యూ చేసి ఆదేశాలు జారీ చేయడం పార్టీ వర్గాలతో పాటు అధికారులనూ ఆశ్చర్యానికి గురి చేశాయి.
ఇరిగేషన్ అధికారులతో రివ్యూ..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం తన స్వగృహమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారులందరూ తుమ్మల ఇంటికి క్యూ కట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పెండింగ్లో ఉన్న విషయాలను సెక్రటరీ రజత్ కుమార్ సేన్ కు తెలపడంతో పాటు.. రెండు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మంత్రి హరీశ్ రావుతోనూ మాట్లాడారు. ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి పెండింగ్ పనులు జూన్, జూలై నెల వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఏ హోదాలో అధికారులను పిలిపించుకుని రివ్యూ చేశారనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాలతో పాటు అధికారుల్లోనూ జరుగుతున్నది.
తుమ్మలకు మళ్లీ ప్రియారిటీ..
కొంతకాలంగా సీనియర్ నాయకుడైనటువంటి తుమ్మల పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో స్తబ్ధుగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో కందాల, తుమ్మల వర్గాలుగా పార్టీ శ్రేణులు విడిపోయాయి. అంతేకాదు.. పార్టీ అధిష్టానం సైతం తుమ్మలను అంతగా పట్టించుకోలేదనే ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే ఇటీవల పోటీకి నేను కూడా సై అనడంతో.. పార్టీలో కలకలం మొదలైంది.. పార్టీ మారుతాడా..? లేక పార్టీ టికెట్ ఇస్తుందా అనే చర్చ మొదలవడం.. పొంగులేటి పార్టీ మార్పు పరిణామాలు.. ఇవన్నీ మళ్లీ తుమ్మలకు ప్రియార్టీ తెచ్చిపెట్టాయి.. పొంగులేటితో నాగేశ్వరరావు సైతం పార్టీ మారితే ఉమ్మడి జిల్లాలో ఇబ్బంది తప్పదని భావించే అధిష్టానం మళ్లీ తుమ్మలను దగ్గరకు తీసిందనే ప్రచారం జరుగుతున్నది.
ఖమ్మం సభతో మళ్ళీ జోష్..
తుమ్మలకు సీఎం కేసీఆర్ మళ్లీ ప్రియారిటీ ఇవ్వడం, ఖమ్మం సభ సక్సెస్ లో తుమ్మల పాత్ర సైతం ఉందనడంలో తుమ్మల వర్గంలో మళ్లీ జోష్ మొదలైంది. తుమ్మలను సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయనకు మంది హోదా ఇవ్వాలని అధిష్టానం మదిలో ఉందని కూడా ప్రచారం జరిగింది. ఒకానొక దశలో కేసీఆర్ కేబినెట్‌లోకి మళ్లీ తుమ్మలను తీసుకుంటారనే ప్రచారం సైతం జరిగింది.
ఈ క్రమంలోనే తుమ్మల మళ్లీ యాక్టివ్ అయ్యారు. అంతేకాదు.. ఎలాంటి హోదా లేకున్నా అధికారులను పిలిపించుకుని మరీ రివ్యూలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎవరూ లేకుండా ఎలాంటి హోదాలేని తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ అధికారులతో రివ్యూ ఏర్పాటు చేయడంతో కొందరు నేతలు ఇబ్బందిగా ఫీలవుతున్నారు.