వైరాలో రెచ్చిపోతున్న పాత ఇనుము దొంగలు.. రూ.75 వేల కండక్టర్ వైరు చోరీ

వైరా పట్టణంలో పాత ఇనుము దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.

Update: 2024-07-12 07:14 GMT

దిశ, వైరా: వైరా పట్టణంలో పాత ఇనుము దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న ఇనుముతో పాటు గోదాముల్లో దాచిన అల్యూమినియం, ఇనుప వస్తువులను తాళాలు పగలకొట్టి మరీ చోరీ చేస్తున్నారు. వైరాలో కొంతమంది ఇనుమును చోరీ చేసి అతి సులువుగా నగదును సంపాదించటమే పనిగా పెట్టుకున్నారు. వైరాలోని మధిర రోడ్డులో ఉన్న ఇందిరమ్మ కాలనీకి చెందిన కొంతమంది ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వైరాలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా ఓ రేకుల షెడ్డు గోదాములో సఖి ఎంటర్ప్రైజెస్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ నిల్వ ఉంచిన విద్యుత్ పరికరాలను చోరీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే విద్యుత్ కాంట్రాక్టును సఖి ఎంటర్ప్రైజెస్ ప్రాజెక్టు దక్కించుకొని పనులు చేస్తుంది. ఈ పనుల కోసం అవసరమైన విద్యుత్ పరికరాలను మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డు గోదాము లో భద్రపరిచారు. ఈ గోదాము ఆవరణలో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో పాటు రేకులతో గోడ నిర్మించారు.

అయితే గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఈ గోదాముకు వెనక వైపు వున్న దారి నుంచి ts04ub0756 ట్రాలీ ఆటోలో ఓ దుండగుడు వచ్చాడు. ఆవరణకు గోడగా ఉన్న రేకును తొలగించి లోపలికి ప్రవేశించాడు. గోదాం తలుపుకు ఉన్న తాళం పగలకొట్టి సుమారు 250 కిలోల త్రిబుల్ ఎ అల్యూమినియం కండక్టర్ వైరును అపహరించి ఆటోలో పరారయ్యాడు. అదే సమయంలో స్థానికులు కొంతమంది అతనిపై అనుమానం వచ్చి ప్రశ్నించగా అల్యూమినియం వైర్ కొనుగోలు చేసి తీసుకవెళుతున్నట్లు బుకాయించాడు. ఇదే గోదాము ఆవరణలో ఇటీవల 106 ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ బీడు పైపులను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ పైపుల విలువ సుమారు రూ 2.20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ చోరీలపై సఖి ఎంటర్ప్రైజెస్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ గోపీనాథ్ రెడ్డి, సైట్ ఇంజనీర్ వీరబాబు వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చోరీకి ఉపయోగించిన ఆటో నెంబర్ ఆధారంగా దుండగుడిని పట్టుకునేందుకు వైరా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


Similar News