Thummala : తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు పెంపుకు పెద్దపీట

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని

Update: 2024-10-28 10:22 GMT

దిశ, దమ్మపేట: తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగులపల్లీ గ్రామంలోని తన స్వగృహంలో తన మలేషియా పర్యటనపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలు పామాయిల్ సాగుకు అనుకూలమేనని రాష్ట్రంలో ఉన్న రైతులు పామాయిల్ సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకుగాను ఆయిల్ ఫామ్ సాగుపై నూతన విధానాలు అధ్యయనం చేయడం కోసం మలేషియాలో పర్యటించి పామాయిల్ సాగుపై నూతన విధానాలు తెలుసుకున్నామని అన్నారు.

మలేషియాలో రోజుకు 900 కిలోమీటర్ల మేర మూడు రోజులు పాటు ప్రయాణించి నూతన పద్ధతులు తెలుసుకున్నామని, ఆ దేశ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. మలేషియా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో సీడ్ గార్డెన్లు, ఆయిల్ రిఫైనరీ ఇక్కడ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశామని అన్నారు, పామాయిల్ చెట్టు ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా తక్కువ ఎత్తులో గెలలు కాసే విధంగా విత్తనాన్ని తయారు చెయ్యాలని కోరామని, అంతేకాకుండా అక్కడ పామాయిల్ గెలలు కోసే పనిముట్లను పరిశీలింమని అన్నారు. పామాయిల్ గెలలు కోయడానికి ఇక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గెలలు కోసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, అలా జరగకుండా ఫైబర్ హార్వెస్టింగ్ మిషన్లు పరిశీలించామని, త్వరలో ఫైబర్ హార్వెస్టింగ్ కటింగ్ మిషన్లను ఇక్కడికి తీసుకు రాబోతున్నామని అన్నారు.

ప్రస్తుతం నాటిన పామాయిల్ మొక్కలకు కొన్ని వాటికి గెలలు రావడం లేదని తద్వారా రైతులు ఆ మొక్కను తొలగించి కొత్త మొక్కలు పెట్టుకోవడానికి సమయం వృధా అవుతుంది కనుక, అలాంటి మొక్కలను ముందే గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. మలేషియా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో సీడ్ నర్సరీలు స్థాపించి, లేటెస్ట్ సీడ్ మిషన్ నూతన పద్ధతి ద్వారా ఎక్కువ గెలలు వచ్చే మొక్కలు తయారు చేయాలని విజ్ఞప్తి చేశామని, అంతేకాకుండా ఓఈఆర్ పెంచే విధంగా నూతన మిషనరీలు తయారు,పామాయిల్ ద్వారా మరిన్ని బై ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం ఫ్యాక్టరీలు నెలకొల్పాలని అక్కడి మలేషియా పామాయిల్, వ్యవసాయ శాఖ మంత్రులను మరియు ప్రతినిధులను కోరామని తెలిపారు. వారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటల ద్వారా అధిక లాభాలు..

ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటలు అధిక లాభాలు పొందవచ్చు అని తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు. అంతర పంటలో వక్క, కోకో, మిరియం సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు అని, దీంతో పాటుగా పామాయిల్ మొక్క నాటిన సమయంలో కేవలం మొక్కజొన్న, మిర్చి, పత్తి, శనగ లాంటివి మాత్రమే సాగు చేయడం కాకుండా మునగ సాగు చేయాలని, ప్రస్తుతం మునగాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని రైతులు మునగ సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పామాయిల్ తో పాటుగా కొబ్బరి పంటకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులు ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలని, నష్టం రాని పంటలు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.

జ్ఞానోడర్మ తెగులు రాకుండా ముందస్తు చర్యలు..

ప్రస్తుతం పామాయిల్ మొక్కలకు జ్ఞానోడర్మ సోకడం ద్వారా రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ తెగులు రాకుండా మలేషియాలో నూతన విధానాన్ని తెలుసుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మలేషియా పద్ధతిలో మొక్కను పెంచే సమయంలోనే ఆ తెగులు రాకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు ముందస్తుగానే చేస్తామని అన్నారు.

యంజీపీ రూ.20వేల కోసం త్వరలో పోరాటం..

పామాయిల్ పంటకు మినిమం గ్యారెంటీ ప్రైస్ రూ.20వేలు ఉండేటట్లుగా పామాయిల్ సాగు అయ్యే రాష్ట్రాలతో కలిసి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి మినిమం గ్యారెంటీ ప్రైస్ కోసం విజ్ఞప్తి చేయబోతున్నామని, దిగుమతి సుంకాన్ని 25 శాతం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మట్టా దయానంద్, పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, డైరెక్టర్ కొయ్యల అచ్యుతరావు, రావు గంగాధరరావు, కేవీ సత్యనారాయణ, కాసాని నాగప్రసాద్, ఎర్ర వసంతరావు తదితరులు పాల్గొన్నారు.


Similar News