ఎయిర్ పోర్టు విషయంలో అపోహలు వద్దు
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో విస్తృతంగా పర్యటించారు.
దిశ ప్రతినిధి, కొత్తగూడెం : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో విస్తృతంగా పర్యటించారు. మంత్రికి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా సుజాతనగర్ సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. అనంతరం పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలో రూ. కోటి 70 లక్షల వ్యయంతో హై లెవెల్ బ్రిడ్జి కు శంకుస్థాపన చేశారు. పాల్వంచ సీతారామపట్నం నుండి పాండురంగాపురం గ్రామం వరకు రూ.10 కోట్ల రూపాయల వ్యయంతో రెండు వరుసల బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మీదేవి పల్లి మండలంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ రామచంద్ర సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో రైఫిల్ షూటింగ్ సెంటర్ కు ప్రారంభోత్సవం చేశారు. చాతకొండ ఆరవ బెటాలియన్ ప్రవేశ ద్వారం నుండి పెరేడ్ గ్రౌండ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఇందిరా మహిళ శక్తి కింద స్వయం సహాయ సంఘాలు నిర్వహిస్తున్న ఫుడ్ కోర్ట్ సందర్శించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని మహిళా టీచర్ దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ పనితీరు అభినందనీయమని, సీఎం కప్ లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్న జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలే కావడం గర్వకారణం అని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా ఉంటుందని, గత పాలకుల పాలనలో విసిగివేశారిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని అన్నారు.
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించి తీరుతాం అని హామీ ఇచ్చారు. హాస్టల్ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాస్మెటిక్ చార్జీలు పెంచామని, గత ప్రభుత్వం ఈ పని చేయలేకపోయిందని విమర్శించారు. ఏర్పోర్ట్ నిర్మాణంలో ఎలాంటి అపోహలు ప్రజలు నమ్మొద్దని కొత్తగూడెంలోనే నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకంను ప్రవేశపెట్టినా అది మా ప్రాంతానికి కావాలి అని పట్టుబట్టి సాధించేవరకు నిద్రపోని వ్యక్తి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.