పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు.
దిశ, వైరా : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు రక్షణ కవచం కిట్లను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల కులస్తులకు సబ్సిడీపై సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. గీత కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు సబ్సిడీపై రుణాలు, యంత్ర పరికరాలు అందజేస్తుందని వివరించారు.
గీత కార్మికులు సంక్షేమ పథకాలు వినియోగించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారిని జ్యోతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్, మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు, ఎక్సైజ్ సీఐ మమత, పలు శాఖల అధికారులు, గీత కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.