Atrocious : కర్రకు కట్టి పేద మహిళ మృతదేహం తరలింపు
మణుగూరు మున్సిపాలిటీ అధికారులు ఓ పేద మహిళ, వికలాంగురాలు మృతి పట్ల అత్యంత క్రూరత్వంగా వ్యవహరించారు.
దిశ,మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీ అధికారులు ఓ పేద మహిళ, వికలాంగురాలు మృతి పట్ల అత్యంత క్రూరత్వంగా వ్యవహరించారు.పేద మహిళ, వికలాంగురాలు మృతదేహానికి వెయ్యి రూపాయలు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన రాసమల్ల సంధ్య రాణి అనే ఓ మహిళ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. అయితే సంధ్య కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మణుగూరు మున్సిపాలిటీలో ఉన్న వైకుంఠ రథాన్ని పంపించండని కోరారు. దానికి అధికారులు ఓ లెటర్ పెట్టుకోవాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఒకటి కాదు, రెండు లెటర్లు పెట్టామని వాపోయారు. మృతదేహాన్ని
తీసుకువెళ్లడానికి సమయం దాటిపోతుంటే మున్సిపాలిటీ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైకుంఠ రథం రావాలంటే వెయ్యి రూపాయలు ఇస్తేనే వెహికల్ వస్తుందని డిమాండ్ చేశారని తెలిపారు.పేద మహిళ, వికలాంగురాలు అని చూడకుండా వెయ్యి రూపాయలు డిమాండ్ చేయడం ఏంటని గ్రామ ప్రజలు మున్సిపాలిటీ అధికారులను ప్రశ్నించారు. గత్యంతరం లేక కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు సంధ్యరాణి మృతదేహాన్ని జోరువానలో కర్రతో కట్టుకొని శ్మశాన వాటికకు తీసుకుకెళ్లారు. వికలాంగురాలు మృతదేహానికి డబ్బులు డిమాండ్ చేసిన మున్సిపాలిటీ అధికారులపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.