కేవీసీఎం విద్యాసంస్థల స్థలం ఇక ప్రభుత్వానిదే

ఖమ్మంజిల్లా వైరాలో సుమారు రూ.35 కోట్ల విలువైన కొండబోలు వెంకయ్యచౌదరి మెమోరియల్ విద్యాసంస్థలకు చెందిన స్థలం, భవనాలను ప్రభుత్వం ఈనెల 4వ తేదీన స్వాధీనం చేసుకుంది.

Update: 2024-07-05 14:50 GMT

దిశ, వైరా : ఖమ్మంజిల్లా వైరాలో సుమారు రూ.35 కోట్ల విలువైన కొండబోలు వెంకయ్యచౌదరి మెమోరియల్ విద్యాసంస్థలకు చెందిన స్థలం, భవనాలను ప్రభుత్వం ఈనెల 4వ తేదీన స్వాధీనం చేసుకుంది. ఈ విద్యాసంస్థలకు చెందిన స్థలం, భవనాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారు. భట్టి విక్రమార్కకు ఇచ్చిన హామీ మేరకు కేవీసీఎం విద్యాసంస్థల చైర్మన్ కొండబోలు రవికుమార్ ఈ ఆస్తులను గురువారం ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. సుమారు రూ.35కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు వైరా కేవీసీఎం ట్రస్టు సిద్ధమని గత నెలలో కొండబోలు రవికుమార్ ప్రకటించారు.

    స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో వైరాలో సామాజిక సృహ కల్గిన వ్యక్తులు కలిసి తమ ప్రాంతంలో విద్యావసరాల కోసం ఈ భూములను సమీకరించారు. వైరాలో విద్యాభివృద్ధి కోసం పాటుపడిన వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన మధిర తొలి ఎమ్మెల్యే కొండబోలు వెంకయ్యచౌదరి పేరిట 1992 సంవత్సరంలో ఈ డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేశారు. 1953 సంవత్సరంలో ఆంధ్రనికేతన్ కమిటీ పేరుతో వైరాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఉన్నత పాఠశాలను ప్రారంభించి 1969వరకు నిర్వహించారు. అనంతరం

    ఈ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇదే క్రమంలో 1982లో అప్పటి మధిర ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు చొరవతో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు ఇతర గ్రామ ప్రముఖుల తోడ్పాటుతో కేవీసీఎం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉంటున్న వెంకయ్యచౌదరి కుమారులు రవికుమార్, సురేష్ బాబు ఇతర కుటుంబసభ్యులు ఎన్నారైల తోడ్పాటుతో కేవీసీఎం డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. 1992 నుంచి 2009వరకు డిగ్రీ కళాశాల కొనసాగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో డిగ్రీ కళాశాల మూతపడింది. 2011లో కేవీసీఎం ఎన్నారై పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించగా 2015 వరకు ఈ కళాశాల నడిచింది. ఆ తర్వాత ఈ పాలిటెక్నిక్ కళాశాల కూడా మూతపడింది. 9ఏళ్ల నుంచి కేవీసీఎంకు చెందిన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి.

షరతులను అంగీకరించి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

ఈ ఏడాది మార్చి 5వ తేదీన కేవీసీఎం ట్రస్టు చైర్మన్ కొండబోలు రవికుమార్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ ఆస్తులను విద్య కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు. అయితే ఆ ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించారు. వాటి ప్రకారం ఈ ఆస్తుల ప్రాంగణంలో ఏ సంస్థలు స్థాపించినా కొండబోలు వెంకయ్య చౌదరి పేరును కొనసాగించాలని, ఇక్కడ ఏర్పాటుచేసిన కొండబోలు వెంకయ్యచౌదరి విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని, ముగ్గురు సిబ్బందిని ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని షరతులు విధించారు. వీటికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

14.03 ఎకరాలు స్వాధీనం

ఈ కేవీసీఎం సొసైటీకి చెందిన సర్వేనెంబర్ 72ఎలో 13.24 ఎకరాలు, సర్వేనెంబర్ 71ఎలో 0.19 ఎకరాలు మొత్తం 14.03 ఎకరాల స్థలాన్ని, భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వైరా గిర్దావర్-1 ఎం.వెంకటేశ్వరరావు పంచనామా నిర్వహించగా తహసీల్దార్ కేవీ. శ్రీనివాసరావు ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. దీంతో సుమారు రూ.35 కోట్ల

    ఆస్తులు ప్రభుత్వానికి లభించాయి. ట్రస్టు తీర్మానంకు అనుగుణంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించి కొండబోలు రవితో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రభుత్వం సమీకృత అంతర్జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. అంతకంటే ముందుగా అవసరమైతే తాత్కాలికంగా వంద పడకల ఆసుపత్రిని నిర్వహించాలని భావిస్తుంది. ఇటీవల వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఈ స్థలాలను పరిశీలించి భట్టి విక్రమార్కకు పరిశీలన నివేదికను అందించారు. 


Similar News