కమిటీలతోనే సరి...స్పష్టత లేని ఐదు గ్రామాల విలీనం

ఆరవ తేదీ గురించి ఎంతో ఆశతో ఎదురు చూసిన భద్రాచలం పట్టణ ప్రజలతో పాటు ఆంధ్రలో విలీనం అయిన ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు నిరాశకు గురయ్యారు.

Update: 2024-07-06 16:09 GMT

దిశ, భద్రాచలం : ఆరవ తేదీ గురించి ఎంతో ఆశతో ఎదురు చూసిన భద్రాచలం పట్టణ ప్రజలతో పాటు ఆంధ్రలో విలీనం అయిన ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు నిరాశకు గురయ్యారు. ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చలలో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, పోలవరం ముంపు పేరుతో ఆంధ్రలో విలీనం చేసిన ముంపునకు గురికాని పిచ్చుకుల పాడు, కన్నాయుగూడెం,

    ఎటపాక, పురుషోత్తమ పట్నం, గుండాల పంచాయతీలను భద్రాచలంలో కలపడానికి మార్గం సుగమం అవుతుందని భావించారు. కానీ ముఖ్యమంత్రుల చర్చలు పొడి పొడి గా సాగడంతో ఐదు పంచాయతీల విలీనంపై స్పష్టత లేకుండా పోయింది. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేసి రాష్ట్ర విభజన నాటి సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించడంతో భద్రాచల ప్రాంత ప్రజలు ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు.

మరోసారి భేటీ..?

రాష్ట్ర విభజన నాటి సమస్యల పరిస్కారం కోసం ఏర్పాటు కాబోయే రెండు కమిటీలు నివేదిక అనంతరం మరోసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది. సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక అవగాహనకు వచ్చాక వారి నిర్ణయాన్ని కేంద్ర హోమ్ శాఖకు తెలియపరుస్తారు. అప్పుడే ఆంధ్రలో విలీనం అయిన పోలవరం ముంపునకు గురికాని ఐదు పంచాయతీలు తెలంగాణలో కలిసే అవకాశం ఉంది.

కలిసిరాని జూలై

గ్రామాలను విలీనం చేసే పోలవరం ఆర్డినెన్స్ ను 2014 జూలై లో పార్లమెంట్ అంగీకరించింది. రాష్ట్ర విభజన అనంతరం 10 సంవత్సరాలకు ఆంధ్ర, తెలంగాణ ముఖ్య మంత్రులు విభజన నాటి సమస్యల పరిస్కారం కోసం చర్చించడానికి మళ్లీ జూలై లోనే కలిశారు. ఆరోజు తెలంగాణలోని 7 మండలాలు ఆంధ్రలో విలీనం కారణంగా భద్రాచలం పట్టణం చాలా నష్టపోయింది.

    ఇద్దరు ముఖ్య మంత్రులు కలయిక ద్వారా తమ సమస్యకు పరిస్కారం దొరుకుతుందనుకుంటే... చర్చలు చప్పగా సాగాయి. పై రెండు సంఘటనలు జూలై లోనే జరగడంతో ఈ ప్రాంత వాసులకు జూలై నెల కలిసి రాలేదని భావిస్తున్నారు.

ముంపునకు గురికాకపోయినా ఎందుకు కలిపారు

పోలవరం కారణంగా ముంపునకు గురయ్యే జాబితాలో లేని కన్నాయుగూడెం, పిచ్చుకుల పాడు, ఎటపాక, గుండాల, పురుషోత్తమ పట్నం పంచాయతీలను అధికారులు కావాలనే ఆంధ్రలో విలీనం చేశారు. ఎందుకంటే ముంపు వాసులకు పునరావాసం కల్పించేందుకు ఈ పంచాయతీలను ఆంధ్రలో విలీనం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఐదు పంచాయతీల పాలన ఆంధ్ర ప్రభుత్వానికి భారమే అయినా...

     పోలవరం ముంపు భాధితులకు పునరావాసం కల్పించడానికి చాలా అవసరం. ఇలాంటి పరిస్థితిలో ఆంధ్ర ప్రభుత్వం ఈ పంచాయతీలను వదులుకోవడానికి అంత తేలిగ్గా ఒప్పుకోక పోవచ్చు. అయితే ఆయా పంచాయతీల ప్రజలు భారీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది.


Similar News