దిశ, కరకగూడెం: మండలంలోని ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తొలగించాలని సీపీఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని బట్టుపల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని ప్రభుత్వ భూముల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని వాటిని అరికట్టకుండా ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, అంతేకాకుండా వారిని ప్రోత్సహిస్తున్నారని వారు లేకపోలేదని అన్నారు.
ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని కరకగూడెం మండల కేంద్రంలో, బట్టుపల్లి కేంద్రాల్లో విపరీతమైన భూ దందా కొనసాగుతుందని, గతంలో ప్రభుత్వ భూములుగా నిర్ధారించి బోర్డులు పెట్టిన స్థలాలు అన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయని అన్నారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం అని దుయ్యబట్టారు.
తక్షణమే అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు లేని పేదలందరిని సమీకరించి ఇళ్ల స్థలాల పోరాటం నిర్వహిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు నరసింహారావు, శంకరయ్య రాము, వెంకటయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.