‘బీసీ డిపార్ట్మెంట్‌ని టార్గెట్ చేశావా..నన్ను టార్గెట్ చేశావా..?’.. బెదిరింపు ధోరణితో వార్డెన్

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో నడుస్తున్న బీసీ బాలుర

Update: 2024-09-30 09:34 GMT

దిశ, ఎడ్యుకేషన్ ఖమ్మం : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో నడుస్తున్న బీసీ బాలుర వసతిగృహంలో నెలకొన్న సమస్యలపై దిశ పత్రికలో సోమవారం 'ఇష్టారీతిగా హాస్టల్ నిర్వహణ' కథనం వెలువడింది. వాస్తవానికి పత్రికలో కారేపల్లి వసతి గృహంలో విద్యార్థులు పడుతున్న గోసను వెలువరించింది. కథనాలు చూసిన వార్డెన్ మీరు బీసీ డిపార్ట్మెంట్ ను టార్గెట్ చేశారా? లేక నన్ను టార్గెట్ చేశారా? నేను దేనికైనా రెడీ. రాష్ట్రంలో వసతి గృహాల్లో సమస్యలు ఏమీ లేవా? మంచిగా నడుస్తున్న హాస్టల్ మీద వార్తలు ఎందుకు రాస్తున్నారు. గత 30 ఏళ్ల నుంచి ఈ వసతిగృహం అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నాము. నేను వచ్చిన తర్వాతనే కొద్దిగా మంచి అద్దె భవనంలో హాస్టల్ ను నిర్వహిస్తున్నాము. ఈ హాస్టల్ లో పనిచేయడం వల్ల నాకు అదనపు జీతం ఏమీ రాదు. అంటూ కారేపల్లి హాస్టల్ వార్డెన్ దిశ విలేఖరికి బెదిరించే ధోరణి లో వాట్సాప్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది.

వాస్తవాలు రాస్తున్న ‘దిశ’ పై అక్కసు...

ఒక్కరోజు కాదు...రెండు రోజులు కాదు.. నెలలు కాదు... 30 ఏళ్ల నుంచి బీసీ బాలుర కారేపల్లి వసతి గృహాన్ని అద్దె భవనంలోని నిర్వహిస్తున్నారు. సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు ఒకే గదిలో 60 మంది విద్యార్థులు బస చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అసలే వర్షాకాలం.దీనికి తోడు హాస్టల్ భవనం కిటికీలకు కనీసం ఒక్క కిటికీ డోర్ అయినా లేదు. నిత్యం జలుబు, జ్వరాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. హాస్టల్ లో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉండి విద్యార్థుల బాగోగులు చూడాల్సిన హాస్టల్ వార్డెన్ విధులకు సక్రమంగా హాజరు అవ్వట్లేదని కూడా తెలుస్తుంది. హాస్టల్ లో కంప్యూటర్ ఆపరేటర్ నియామకం పేరుతో ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించి, హాస్టల్ వార్డెన్ డ్యూటీ కి రాకుండా ఈ ప్రైవేటు వ్యక్తి సహకారంతోనే విధులను చక్కపెడుతున్నట్లు తెలుస్తుంది. 60 మంది విద్యార్థులు కలిపి, రెండంటే రెండే బాత్రూంలు ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్ కు పక్కనే ఉన్న వంట గదిలో వంట తో పాటుగా, కంప్యూటర్ ఆపరేటర్ గా ఓ ప్రైవేటు వ్యక్తి వార్డెన్ విధులను నిర్వహిస్తున్నాడు. ఈ వంటగది కూడా వర్షాలకు కురుస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. ఉన్న సమస్యలనే అద్దంలో కనిపించే విధంగా దిశ పత్రికలో ప్రచురించారనే అక్కసుతో వార్డెన్.. మీరు నన్నే టార్గెట్ చేస్తారా? 'నేను దేనికైనా రెడీ' అనే బెదిరించే ధోరణిలో విలేకరులకు వాట్సాప్ లో మెసేజ్ పంపిచాడు.

ఇంటెలిజెన్స్ ఆరా..!

కారేపల్లి బీసీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. సోమవారం ఉదయం వసతి గృహన్ని తనిఖీ చేసినట్లు తెలుస్తుంది. కథనం వెలువడిన రోజే ముందస్తు చర్యలలో భాగంగా వార్డెన్ వసతి గృహ కిటికీలకు, జాలి ఏర్పాటు చేశారు. వంట గదిలో నిల్వ ఉంచిన బియ్యం, పప్పు, ఇతర సామాగ్రిని శుభ్రంగా ఉంచాలని సూచించినట్లు తెలుస్తోంది. వార్డెన్ పై ఉన్నత అధికారులకు నివేదిక ఇవ్వనట్లు తెలుస్తుంది.

వార్డెన్ పై చర్యలు ఎప్పుడు?

కారేపల్లి బీసీ బాలుర వసతి గృహంలో పనిచేసే హాస్టల్ వార్డెన్ ముచ్చర్ల కేంద్రంగా నడుస్తున్న షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ హాస్టల్ కు రెగ్యులర్ వార్డెన్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ పనిచేస్తూనే కారేపల్లి బీసీ బాలుర వసతి గృహానికి ఇన్చార్జిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు హాస్టళ్లను దగ్గర ఉండి చూసుకోవాల్సిన వార్డెన్, కారేపల్లి వసతి గృహంలో ప్రైవేటు వ్యక్తిని నియమించడం పలు అనుమానాలకు తావిస్తోంది. హాస్టల్ లో నెలకొన్న సమస్యలపై జిల్లా అధికారులు దృష్టి సారించి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.


Similar News