విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన.. హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు

వైరా మండల పరిధిలోని పాలడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతోన్న విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెచ్ఎం చావా శ్రీనివాసరావు‌పై సస్పెన్షన్ వేటు పడింది.

Update: 2024-09-30 08:42 GMT

దిశ, వైరా: వైరా మండల పరిధిలోని పాలడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతోన్న విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెచ్ఎం చావా శ్రీనివాసరావు‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కే.సత్యనారాయణ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల పట్ల ప్రధానోపాధ్యాయుడు చావా శ్రీనివాసరావు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని శనివారం తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులను తల్లిదండ్రులు గదిలో నిర్బంధించి తాళం వేశారు. అనంతరం వైరా సీఐ సాగర్ హుటాహుటిన పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రుల‌తో మాట్లాడి వారిని శాంతింపజేసి తాళం తీయించారు.

అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ పాఠశాలలో విచారణ చేపట్టారు. అదే రోజు ముగ్గురు విద్యార్థినుల తల్లిదండ్రులు హెచ్ఎం తమ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైరా ఎస్సై ఏ.వంశీకృష్ణ భాగ్యరాజు శ్రీనివాస రావుపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. డీఈఓ నివేదికతో పాటు పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా హెచ్ఎం చావా శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆర్జేడీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్రమశిక్షణ చర్యలు ముగిసే వరకు శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆర్జేడీ అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని పేర్కొన్నారు.


Similar News