అంతా ఆయన ఇష్టారాజ్యమే.. వైరా సబ్ రిజిస్ట్రార్ తీరు

వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Update: 2024-09-29 05:20 GMT

దిశ, వైరా: వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయం పనివేళలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని డాక్యుమెంట్ రైటర్లే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన పని వేళలను కుదించటం ఆ అధికారి ఇష్టారాజ్య తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. వైరా లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రామచంద్రయ్య సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తుంది. వైరాలో గదిని అద్దెకు తీసుకొని నివసిస్తున్న ఆయన సెలవు దినములకు ముందు రోజు రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వ నియమ నిబంధనలే మార్చేస్తున్నారు. హైదరాబాద్ లోని తన నివాసానికి సెలవు దినాలకు ముందు రోజు త్వరగా బయలుదేరి వెళ్లేందుకు మధ్యాహ్నం 3.30 గంటల లోపు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వచ్చే డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేయనని తెగేసి చెబుతున్నారు. అదేంటని ప్రశ్నిస్తే సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థలో ఈ రూల్ ఉందని చెప్పడం విశేషం.

అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ కార్తీక్ కుటుంబం వరంగల్‌లో నివాసం ఉంటుంది. ఆయన అడపాదడపాగా వైరాలో ఉంటూ వరంగల్ నుంచే డైలీ సర్వీస్ చేస్తున్నారు. వీరు ఇరువురు కలిసి సెలవు దినాలకు ముందు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వచ్చిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సెలవు దినాలకు ముందు రోజు మధ్యాహ్నం 3.30 గంటలకే డాక్యుమెంట్లు తీసుకురావాలని, ఆ తర్వాత డాక్యుమెంట్లు తీసుకువస్తే రిజిస్ట్రేషన్ చేయమని సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్య డాక్యుమెంట్ రైటర్‌లకు స్పష్టం చేశారు. ఈ విషయమై సబ్ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్ రైటర్‌లకు మధ్య సంవాదాలు కూడా జరిగాయి. ప్రభుత్వ జీతం నెలవారీగా తీసుకుంటున్న అధికారులు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్‌లను మధ్యాహ్నం 3.30 గంటలలోపే చేస్తామని చెప్పటం వివాదాస్పదంగా మారుతుంది . ఇప్పటికే ఈ కార్యాలయంలో రసీదుకు మసీదు పేరుతో రిజిస్ట్రేషన్‌కు రూ.7000, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు రూ.2000 లను అక్రమంగా వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం సబ్ రిజిస్ట్రార్ ఓ ప్రైవేటు వ్యక్తితో ఈ నగదును వసూలు చేయిస్తున్నారని డాక్యుమెంట్ రైటర్లే బహిరంగంగా చెబుతున్నారు . ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతిని అరికట్టి అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యను దిశ వివరణ కోరగా మధ్యాహ్నం 3.30 గంటల లోపే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకోవాలనే నిబంధన రిజిస్టార్ చట్టంలోనే ఉందని తెలిపారు. తాను చట్ట ప్రకారమే నడుచుకుంటున్నానని చెప్పారు. 3.30 గంటల తర్వాత వచ్చే డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయరా అని ప్రశ్నించగా ఆ సమయంలో సర్వర్లు బిజీగా ఉంటాయంటూ సమాధానాన్ని దాటవేశారు.


Similar News