‘పౌర సరఫరాలు’ ఆ ఇద్దరి చేతుల్లోనే..! రూ.కోట్లలో ముడుపుల ఆరోపణలు

పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి చోటుచేసుకుంటోంది.

Update: 2024-09-30 02:24 GMT

పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి చోటుచేసుకుంటోంది. ఆ శాఖలో పని చేసే కొందరు అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఓ ఉన్నతాధికారి సైతం ఇందులో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు వస్తుండటం విస్మయం కలిగిస్తుంది. సీఎంఆర్ ధాన్యం సేకరణ, మిల్లింగ్, ఎంఐటీ, గన్నీ బ్యాగుల వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో చినికిచినికి గాలివానగా మారుతుంది. బియ్యం కేటాయింపుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకోవడం, అధికారులు ఇతోధికంగా మిల్లర్లకు సహాయ సహకారాలు అందించమే కాకుండా అడ్డుచెప్పిన మిగతా అధికారులను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో ఆరోపణలు లేని అధికారులు డమ్మీలుగా మారుతున్నారే ప్రచారం జరుగుతోంది.

దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పౌర సరఫరాల శాఖలో అవినీతి వేళ్లూనుకుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆ శాఖలో పని చేసే కొందరు ఉద్యోగులు మిల్లర్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో ఇష్టానుసారంగా సాగుతుంది. తాజాగా, జిల్లాలోని కొన్ని మిల్లుల్లో విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ దాడుల్లో ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలడం ఒక విషయం కాగా.. అధికారుల మధ్య విభేదాలు మరో కారణంగా తెలుస్తుంది. జిల్లాలోని 64 మిల్లుల్లోప్రతీ ఏటా ఖరీఫ్, రబీ పంటల ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్ చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాంలకు తరలించాలి.

కానీ, ఈ తతంగం పూర్తయ్యేసరికి ఇచ్చిన ధాన్యానికి, మిల్లింగ్ చేసి గోదాములకు వచ్చే ధాన్యానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. సివిల్ సప్లైకు చెందిన కొందరు అధికారులు, మిల్లర్ల కారణంగా రూ.కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టడమే కాకుండా.. కొందరు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అంతే కాకుండా మిల్లర్లకు గ్యారెంటీ లేదా బ్యాంకు ష్యూరిటీ లేకుండా బియ్యం సప్లై చేయడం కూడా అందరికీ కలిసివచ్చింది. సీఎంఆర్, గన్నీ బ్యాగుల వ్యవహారంలో టెక్నికల్ ఇంచార్జీగా కీలకంగా వ్యవహరించి అవినీతికి భారీ ఆస్కారం ఇచ్చారని, ఇతనికి ఉన్నతాధికారి ఫుల్ సపోర్ట్ చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

గ్యారెంటీ లేకపోవడంతో..

రూ.కోట్లు విలువ చేసే ధాన్యాన్ని వివిధ మిల్లులకు కేటాయించే విషయంలో అధికారులు ఉదారంగా వ్యవహరిస్తున్నారు. తమతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి అదనంగా, లేనివారికి ఇష్టం వచ్చిన విధంగా సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. దీంతో మిల్లర్లు ప్లాన్ ప్రకారమే ధాన్యాన్ని బయటకు విక్రయిస్తూ.. అధికారులకు వాటాలు పంపుతున్నారని కొందరు మిల్లర్లే బాహాటంగా పేర్కొంటున్నారు. అందులో భాగంగానే మిల్లర్లు ప్రభుత్వం ఒకవేళ రికవరీ యాక్ట్ పెడితే ఇబ్బంది అని భావించి తమ పేరిట ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా చూసుకోవడం గమనార్హం. వైరా మండలం లాలాపురంలోని ఎస్ఏఆర్ రైస్ మిల్లు విషయంలో, ఖమ్మం రూరల్ మండలం మంగళగూడేనికి చెందిన కన్నేటి నర్సింహారావు విషయంలో కూడా ఇదే జరిగింది. సూర్యాపేటకు చెందిన సోమ నర్సయ్య రూ.1.25 కోట్ల మేర సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి కేసు నమోదై జైలుకు వెళ్లి బయటకు రావడంతో జిల్లాకు చెందిన కొందరు మిల్లర్లు అతడిని ఆదర్శంగా తీసుకుని ఈ తంతుకు ఊతమివ్వడం గమనించాల్సిన విషయం. ఇలాంటి వారికి అక్రమార్జనకు అలవాటు పడిన అధికారులే సపోర్టుగా నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అంతా ఆ ఇద్దరే..

పౌర సరఫరాల శాఖలో ఓ ఉన్నతాధికారితో పాటు ఏఎంగా వ్యవహరిస్తున్న వాసంశెట్టి నర్సింహారావు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏఎం దశాబ్ద కాలంగా అదే శాఖలో కొనసాగడం, మిల్లర్లతో మంచి సంబంధాలు కొనసాగడం, వచ్చే ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడంలో సిద్ధహస్తుడని టాక్. ప్రస్తుతం సివిల్ సప్లైయీస్‌లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న పెద్దసారు సైతం ఇతని మాటకు ప్రియారిటీ ఇచ్చి, మిగతా అధికారులను డమ్మీలుగా చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ తతంగాన్ని గమనించిన ఓ అధికారి ఉన్నతాధికారి దగ్గర విషయం చెప్పడంతో ‘కొత్తగా వచ్చావు నీకేమి తెలుసు.. నీవు ఈ శాఖకు చెందిన వ్యక్తివి కూడా కాదు.. మొత్తం ఏఎం చూసుకుంటాడు.. అతడిని ఫాలో అవ్వు’ అని చెప్పడంతో విస్తుపోవడం ఆ ఉద్యోగి వంతైంది.

అంతేకాదు ఉన్నతాధికారి సపోర్ట్ చూసుకుని సదరు ఉద్యోగిని అప్పనుంచి టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. మిల్లర్లను కూడా ఆ ఉద్యోగి మీదకు ఉసిగొలిపి విభేదాలు క్రియేట్ చేశాడు. అన్ని అంశాల్లో తలదూర్చుతూ ఇతర అధికారులు చేయాల్సిన పని కూడా తానే చేస్తూ మిగతా సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న ప్రచారం సాగుతోంది. క్వాలిటీ, ధాన్యం కేటాయింపు, ఎంఐటీ (మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ సిస్టమ్), సీఎంఆర్, గన్నీ బ్యాగుల అంశాల్లో ఏఎం ప్రమేయం లేకుండా సాగేదికాదన్నది ఆ శాఖలో ఎవ్వరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇక ఉన్నతాధికారి కూడా లాలాపురంలోని ఎస్ఏఆర్ రైసు మిల్లుకు ప్యాడీ ఎక్కువగా కేటాయించారని, వేరే మిల్లుకు షిఫ్ట్ చేస్తానని బెదిరించి ఆ మిల్లర్ నుంచి భారీగా దండుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత షిఫ్టింగ్ విషయం మరిచి, విజిలెన్స్ దాడుల నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారికి ప్యాడీ కేటాయించిన అధికారిదే తప్పని చెప్పడం కొసమెరుపు.

మిల్లర్ల నుంచి వాటాలు..

అనుకూలమైన మిల్లర్లకు భారీ మొత్తంలో ధాన్యం కేటాయింపు విషయంలో ఇతను మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.కోట్లలో అక్రమాలు చోటుచేసుకున్నా ఈ విషయంలో మిల్లర్ల నుంచి కూడా అంతే ఎత్తున ముడుపులు ముట్టాయని తెలుస్తోంది. అందులో ఏఎంతో పాటు.. ఉన్నతాధికారికి కూడా ముడుపులు అందాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలు తెలుసుకునేందుకు కొందరు మిల్లర్లతో పాటు సివిల్ సప్లైయీస్‌లో పని చేస్తున్న కొందరు సిబ్బందిని ‘దిశ’ వివరణ అడగ్గా ముడుపుల విషయంపై వచ్చే ఆరోపణలను కొట్టిపారేయలేమని అన్నారు. డిఫాల్ట్ అయినా పర్వాలేదు కానీ.. ధాన్యాన్ని సేకరించి బయట విక్రయించుకోవడమే ధ్యేయంగా ఉన్న మిల్లర్లకు ఆ ఇద్దరు అధికారులే వెన్నుదన్నుగా ఉండటం ఓ విషయమైతే.. మిల్లర్ల మీదే చర్యలు తీసుకుంటూ ఆ ఇద్దరు అధికారులు చేస్తున్న అక్రమాలపై దృష్టి సారించకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నచ్చని సిబ్బందిని టార్గెట్ చేస్తూ.. బదిలీ చేసే వరకు తాను పని చేయనని అంత వరకు సెలవులోనైనా వెళ్తానని ఏఎం బాహాటంగా చెప్పడం కొసమెరుపు. సీఎంఆర్, గన్నీ బ్యాగులు విషయంలో కూడా భారీగా అవకతవకలకు ఇతనే కారణమన్న ప్రచారమూ జరుగుతోంది. జిల్లా కలెక్టర్‌తో పాటు ముగ్గురు మంత్రులు ఈ విషయంపై లోతుగా విచారణ సాగిస్తే అనేక నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Similar News