కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తా

కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తా అని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు.

Update: 2024-09-28 14:58 GMT

దిశ, అశ్వారావుపేట : కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తా అని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మండల కేంద్రం శ్రీ సత్య సాయిబాబా ఫంక్షన్ హాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ బలోపేతం, లోటుపాట్ల పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

    ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే జారె పార్టీలో ఏదో తెలియని వెలితి ఉన్న మాట వాస్తవం అన్నారు. త్వరలోనే ప్రతి గ్రామానికి పార్టీ తరుపున నలుగురిని కమిటీగా నియమిస్తానన్నారు. వారి ఆధ్వర్యంలోనే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలలో కూడా పార్టీ ఉన్నతికి కృషి చేసే వారికి స్థానం ఉంటుందన్నారు.

ఇతర పార్టీ వ్యక్తులకు కొమ్ము కాయడం లేదు : జూపల్లి రమేష్ బాబు

సమావేశంలో కాంగ్రెస్ నేత జూపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ.. కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రతిపక్ష పార్టీ వ్యక్తులతో అంటకాగుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన కొన్ని సందర్భాలను ఎమ్మెల్యే జారె దృష్టికి తీసుకువెళ్లారు. తాను ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోసమే చేస్తున్నానన్నారు. కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్ధరించేందుకే కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో అసలు సమావేశం ఉద్దేశం దారి తప్పుతుందని సీనియర్ నాయకుడు మొగళ్లపు చెన్నకేశవరావు జూపల్లి వ్యాఖ్యలపై అభ్యంతర వ్యక్తం చేశారు.

    జూపల్లి వర్గీయులు మొగుళ్లపు చెన్నకేశవరావుతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం కొద్దిసేపు రసాభాసగా మారింది. ఎమ్మెల్యే జారె కలగజేసుకొని పార్టీకి నష్టం చేకూర్చే వారెవరు అనేది తన దృష్టిలో ఉందన్నారు. పద్ధతి మార్చుకోకపోతే త్వరలోనే చర్యలు తీసుకుంటానని, వాగ్వాదాన్ని ఆపాలని కోరారు. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి కొందరు నాయకులను బయటికి పంపడంతో వివాదం సద్దుమణిగింది.  

Tags:    

Similar News