ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి స్మగ్లింగ్

ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి నుంచి తెలంగాణలోని హైదరాబాదుకు

Update: 2024-09-30 11:53 GMT

దిశ, భద్రాచలం : ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరి నుండి తెలంగాణలోని హైదరాబాదుకు పెద్ద ఎత్తున గంజాయిని కారులో తరలిస్తుండగా ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం పట్టుకున్నారు. ఐదు ముఠాలలో 138 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 34.50 లక్షల ఉంటుందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి పేర్కొన్నారు. గంజాయి తరలిస్తు... భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పట్టుబడిన కారు డ్రైవర్ మహమ్మద్ ఫరీద్ జహీరాబాద్ గ్రామానికి చెందిన వాడని, ఇతను ముంబైలోని గంజాయి స్మగ్లర్ అయిన యూసఫ్ సాహిద్ ఖాన్ కొరకు గంజాయిని తరలిస్తున్నాడని తెలిపారు. యూసఫ్ సాహిద్ ఖాన్ పై తెలంగాణలో ఘట్కేసర్, కొత్తగూడెంలలో ఐదు కేసులు ఉన్నాయని తిరుపతి తెలిపారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో గంజాయి నిర్మూలించడానికి భద్రాచలం కేంద్రంగా ఆరు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని, ఈ ఆరు రోజుల్లో మొత్తం 12 కేసులు నమోదు చేసి, 30 మందిని అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కేసులలో రూ. 71 లక్షల విలువైన 228 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని,మూడు కార్లు, 12 ద్విచక్ర వాహనాలను సైతం స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి 18004252523 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని ఏ ఈ ఎస్ తిరుపతి కోరారు. సోమవారం నాడు జరిగిన దాడుల్లో ఏ ఈ ఎస్ తిరుపతి, సీఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు సుదీర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


Similar News