విద్యుత్ అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎన్పీడీసీఎల్ సీఎండీ

వర్షాకాలంలో విద్యుత్ సమస్యలను ఎలా అధిగమించాలి..? అందుకు చేపట్టవలసిన చర్యల పై ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి సోమవారం భద్రాచలం డివిజన్ విద్యుత్ సంస్థ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Update: 2024-07-08 15:29 GMT

దిశ, భద్రాచలం : వర్షాకాలంలో విద్యుత్ సమస్యలను ఎలా అధిగమించాలి..? అందుకు చేపట్టవలసిన చర్యల పై ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి సోమవారం భద్రాచలం డివిజన్ విద్యుత్ సంస్థ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గోదావరి వరద నీరు ఆగే భద్రాచల దేవాలయ ప్రాంగణంలోని విస్తా కాంప్లెక్స్ వద్ద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అనంతరం భద్రాచలం డీఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి విపత్తు ఎదురైనా విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. రాత్రింబవళ్లు అధికారులు అప్రమత్తంగా ఉంటూ భద్రాచలం వచ్చే పర్యాటకులకు, విద్యుత్ వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ లను, విద్యుత్ పోల్స్ లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గోదావరి పరివాహ ప్రాంతాల్లోని గ్రామాలు చీకటిలో లేకుండా చూడాల్సిన బాధ్యత తమ పై ఉందన్నారు.

భద్రాచలం డివిజన్ పరిధిలోని పర్ణశాల విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశీలించారు. వరద ముంపునకు గురయ్యే పర్ణశాల సబ్ స్టేషన్ ను అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వరద ముంపు లేని ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇందుకోసం ప్రత్యేక స్థలం చూపించినందున అక్కడికి మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గత ఏడాది వరదల సమయంలో తీసుకున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంఎండికి వివరించారు. వన మహోత్సవంలో భాగంగా భద్రాచలం ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ బీకామ్ సింగ్, డీఈలు జీవన్ కుమార్, నందయ్య, ఏడీఈలు, ఏఈలు, భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.


Similar News