దిశ, భద్రాచలం అర్బన్: మా ఉపాధి కొల్లగొట్టే జెసిబి లతో ట్రాక్టర్ లోడింగ్ ను ఆపాలంటూ.. గత ఎనిమిది రోజులుగా ట్రాక్టర్ డ్రైవర్, లోడింగ్ ముఠా సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది. దీనిలో భాగంగా స్థానిక ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. మీ న్యాయమైన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే చట్టాలకు విరుద్ధంగా కార్మికుల ఉపాధి పోగొట్టి జెసిబిలతో ట్రాక్టర్ లోడ్లు చేస్తున్న ఓనర్స్ సమస్య చర్చల ద్వారా పరిష్కరించుకో పోతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం జరిగిన సమావేశంలో సీఐటీయు పట్టణ కన్వీనర్ వై వి రామారావు మాట్లాడుతూ.. ఎమ్మార్వో కి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికైనా ట్రాక్టర్ యాజమానులు చర్చలకు రావాలన్నారు. అలా కాకుండా మొండిగా వ్యవహరిస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ట్రాక్టర్స్‌ను, జెసిబి లను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు ఎన్ నాగరాజు, సోడే నాగమణి, మాయ కొండ, కే పద్మ, జక్కం తిరుపతమ్మ, తన్నీరు లక్ష్మి, కురసం ఏడుకొండలు, బోర్ర వెంకటేష్, సోడే వీరన్న, తదితరులు పాల్గొన్నారు.