ఇప్పటికీ ‘టీఎస్’ గానే.. కొత్త పవర్ ప్లాంట్‌పై పాత పేరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.32 కోట్ల
దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.32 కోట్ల వ్యయంతో 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను నూతనంగా నిర్మించారు. ఈ నెల 12న ప్రారంభం కానున్న ఈ పవర్ ప్లాంట్ పై ఆయిల్ ఫెడ్ సంస్థను టీఎస్ గానే దర్శనమిస్తుంది. మే 17న తెలంగాణ రాష్ట్ర అధికారిక సంక్షిప్త నామాన్ని టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆయా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలను సూచించే బోర్డులలో టీజీగా మార్పు చేయాలని సూచించారు. కానీ అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ పవర్ ప్లాంట్ పై ఇప్పటికింకా తాటికాయ కంటే పెద్ద అక్షరాలతో "టీఎస్" ఆయిల్ ఫెడ్ అని ఉండడం.. దీన్ని కొత్తగా ప్రారంభిస్తుండడం గమనార్హం..! రాష్ట్రవ్యాప్తంగా పామాయిల్ పంటను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తెలంగాణలో పామాయిల్ ఆదర్శవంతంగా సాగవుతున్న ప్రాంతం అశ్వారావుపేట కావడంతో.. రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు పామాయిల్ సాగుపై అవగాహన కోసం అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శిస్తుంటారు. దసరా పండుగ రోజున జరగనున్న పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీజీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎండీ యాస్మీన్ బాషా లతో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల రైతులు హాజరుకానున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.