వైయస్ విగ్రహానికి అడ్డంగా ప్లెక్సీలు..!
కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో జననేత ఉమ్మడి
దిశ, కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో జననేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రచార ప్లెక్సీలకు ఉపయోగించుకోవడం పట్ల ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నిలువున ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహంతో పాటు చుట్టూ ఉన్న మెట్లు ఫినిషింగ్ కు కొందరు ఫ్లెక్సీలు కట్టి సంతోషం పొందడం సహించరానిదని రాజశేఖరరెడ్డి అభిమానులు మండిపడుతున్నారు.
ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంతోపాటు అన్ని వర్గాల వారికి న్యాయం చేసిన వ్యక్తి విగ్రహాన్ని కొందరు అవమానపరిచే విధంగా వ్యవహరించడం బాధాకరమని పలువురు వాపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహం కనబడకుండా ఫ్లెక్సీలు కడుతుంటే కాంగ్రెస్ నాయకులకు కనబడడం లేదా లేక కనబడి కూడా తమకు ఎందుకులే అని వ్యవహరిస్తున్నారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిని తలిచే నాయకులు ఆయన విగ్రహాన్ని ఫ్లెక్సీలకు ఉపయోగించే విధంగా వ్యవహరిస్తున్న వారిపై ఎందుకు స్పందించడం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.