‘దిశ’ ఎఫెక్ట్.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిపై వేటు

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ప్యాడి విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న

Update: 2024-10-10 15:11 GMT

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ప్యాడి విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని సివిల్ సప్లై కమిషనర్ సస్పెండ్ చేసినట్లు సమాచారం. దిశ వరుస కథనాలు అన్ని ఆధారాలతో ప్రచురించడంతో విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులకు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దీంతో విచారణ చేపట్టిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ ఆ శాఖ ఉన్నత అధికారులకు స్పష్టమైన నివేదిక పంపడంతో దీనికి కారణమైన అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ వాసం శెట్టి నరసింహారావు పై చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వాటాలు తీసుకోవడం,అనుకూలమైన మిల్లర్లకు భారీ మొత్తంలో ధాన్యం కేటాయింపు విషయంలో ఇతను మధ్యవర్తిగా వ్యవహరిస్తు కోట్ల రూపాయల మేర అక్రమాలు చోటుచేసుకున్నాయి అని తెలుస్తోంది.

ఈ విషయంలో మిల్లర్ల నుంచి కూడా కోట్ల రూపాయల మేర ముడుపులు ముట్టాయని అందులో ఏఎం తో పాటు.. ఉన్నతాధికారికి కూడా ముడుపులు అందాయనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయాలు తెలుసుకునేందుకు కొందరు మిల్లర్లతో పాటు సివిల్ సప్లయిస్ లో పనిచేస్తున్న కొందరు సిబ్బందిని 'దిశ' వివరణ అడుగగా ముడుపుల విషయంపై వచ్చే ఆరోపణలను కొట్టిపారేయలేమని చెప్పారు. డిఫాల్ట్ అయినా పర్వాలేదు కానీ.. ధాన్యాన్ని సేకరించి బయట విక్రయించుకోవడమే ధ్యేయంగా ఉన్న మిల్లర్లకు ఆ ఇద్దరు అధికారులే వెన్నుదన్నుగా ఉండటం ఓ విషయమైతే.. మిల్లర్ల మీదే చర్యలు తీసుకుంటూ ఆ ఇద్దరు అధికారులు చేస్తున్న అక్రమాలపై దృష్టి సారించకపోవడంపై అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. నచ్చని సిబ్బందిని టార్గెట్ చేస్తూ, బదిలీ చేసే వరకు తాను పనిచేయనని అంతవరకు సెలవు లోనైనా వెళ్తానని ఏఎం బాహాటంగా చెప్పడం కొసమెరుపు. సీఎంఆర్, గన్నీ బ్యాగులు విషయంలో కూడా భారీగా అవకతవకలకు ఇతనే కారణమన్న ప్రచారం జరుగుతుంది.

సస్పెన్షన్ సరే...గోల్ మాల్ అయిన ధాన్యం పరిస్థితి ఏంటి..?

కోట్లాది రూపాయల విలువచేసే ధాన్యాన్ని వివిధ మిల్లులకు కేటాయించే విషయంలో అధికారులు ఉదారంగా వ్యవహరిస్తున్నారు. తమతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి అదనంగా, లేని వారికి ఇష్టం వచ్చిన విధంగా సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. దీంతో మిల్లర్లు ప్లాన్ ప్రకారమే ధాన్యాన్ని బయటకు విక్రయిస్తూ.. అధికారులకు వాటాలు పంపుతున్నారని కొందరు మిల్లర్లే బాహాటంగా పేర్కొంటున్నారు. అందులో భాగంగానే మిల్లర్లు ప్రభుత్వం ఒకవేళ రికవరీ యాక్ట్ పెడితే ఇబ్బంది అని భావించి తమ పేరిట ఆస్తిపాస్తులు లేకుండా చూసుకోవడం గమనార్హం. వైరా మండలం లాలాపురం లోని ఎస్ఏ ఆర్ రైస్ మిల్లు విషయంలో, ఖమ్మం రూరల్ మండలం మంగళగూడేనికి చెందిన కన్నేటి నర్సింహారావు విషయంలో కూడా ఇదే జరిగింది. సూర్యాపేటకు చెందిన సోమ నరసయ్య రూ. 1.25 కోట్ల మేర సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి కేసు నమోదై జైలుకు వెళ్లి బయటకు రావడంతో జిల్లాకు చెందిన కొందరు మిల్లర్లు అతన్నే ఆదర్శంగా తీసుకుని ఈ తంతుకు ఊతమివ్వడం గమనించాల్సిన విషయం. ఇలాంటి వారికి అక్రమార్జనకు అలవాటుపడిన అధికారులే సపోర్ట్ గా నిలవడం పై శాఖ ఉన్నతాధికారులు,జిల్లా ఉన్నత అధికారులు ఇంకా లోతుగా విచారణ చేసి నిందితుల నుంచి రికవరీ చేస్తే నే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Similar News