మద్దులపల్లి మార్కెట్ రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం : మంత్రి పొంగులేటి

మద్దులపల్లి మార్కెట్ ను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర

Update: 2024-10-10 16:37 GMT

దిశ, ఖమ్మం రూరల్: మద్దులపల్లి మార్కెట్ ను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. కమిటీ చైర్మన్ గా భైరు హరినాథ్ బాబు, వైస్ చైర్మన్ గా వనవాసం నరేందర్ రెడ్డి తో కూడిన 18 మంది డైరెక్టర్లు మంత్రుల సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. మద్దులపల్లి మార్కెట్ కమిటీ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, రాబోయే మూడు నెలల్లోనే మార్కెట్ పనులు పూర్తి చేసి ప్రారంభించే విధంగా నూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా చేస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లలో ప్రభుత్వం రాగానే నాలుగు గ్యారెంటీ లు అమలు చేశామని తెలిపారు.

సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం..రైతులకు 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఇంకా 13 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. రెండు లక్షల పైన ఉన్న వారు బ్యాంకుకు చెల్లిస్తే మిగతా రుణమాఫీ అవుతుందన్నారు. 10 సంవత్సరాలు పాలించిన వారు రైతులకు రుణమాఫీ చేసింది కేవలం 11 వేల కోట్లు మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రం మొత్తం లో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తామని మొదటి విడతలో 31 నియోజకవర్గాల్లో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో స్కూల్ కు 130 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 3వేల మంది పిల్లలకు ఒకే చోట విద్యనభ్యసించే విధంగా పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

రాబోయే కొద్ది రోజుల్లో నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఆనాడు బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో ఒక లక్ష నలబై ఐదు వేల ఇళ్లు ఇచ్చి 95 వేల ఇళ్లు మాత్రమే కట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం కి సంపాదన ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని దుయ్యబట్టారు. వారి ఇల్లు కాపాడు కోసం బావ బావమరుదులు మూసీ పేరుతో నాటకం అడుతున్నారని విమర్శించారు. పేద ప్రజలను రెచ్చ గొడుతున్నారని, పదవులు లేనప్పుడు పేద వాళ్ళ మీద ప్రేమ ఇప్పుడు గుర్తు వచ్చిందన్నారు. కొద్ది రోజుల్లో ఆర్ఓఆర్ చట్టం తీసుకవచ్చి రైతుల సమస్యలకు చెక్ పెడతామని తెలిపారు. అసైన్డ్ భూముల రైతులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలిపారు.

పాలేరు రైతే రాష్ట్రానికి రాజు కావాలి, మద్దులపల్లి మార్కెట్ అభివృద్ధికి రూ. 20 కోట్లు కేటాయింపు..

రాబోవు రోజుల్లో పాలేరు రైతే రాష్ట్రానికి రాజు కావాలని అందుకు కావలసిన వనరులు పాలేరు నియోజకవర్గంలో పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మద్దులపల్లి మార్కెట్ అభివృద్ధి కోసం 20 కోట్లు మంజూరు చేశామన్నారు. గతంలో పాలేరులో బైపోల్ లో గెలిచి మూడు సంవత్సరాలలోనే పాలేరు ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని, అన్ని రహదారులను జాతీయ రహదారులుగా మారాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేస్తాం అన్నారు. కృష్ణా జలాలు రాకపోయినా గోదావరి నీళ్లతో పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలం కాబోతుందన్నారు. ఒకప్పుడు పనికి రాని నియోజకవర్గం ఇప్పుడు అందరికీ పనికి వచ్చే నియోజకవర్గంగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని అది కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ప్రారంభం చేస్తామన్నారు. రైతులకు ఏం సేవ చేయాలో చేస్తామన్నారు.

ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి పంటలకు నష్టపరిహారం ఇస్తామని, వరదల వల్ల నష్టపోయిన రైతులకు 10 వేలు ఖాతాలో వేశామన్నారు.పామాయిల్ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగు లో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుకు పోవాలన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నమన్నారు. ఖమ్మం మార్కెట్ ను తలదన్నే విధంగా మద్దులపల్లి మార్కెట్ అభివృద్ధి జరగాలని,ఆదర్శ వంతమైన మార్కెట్ గా తీర్చి దిద్దే బాధ్యత మాది అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ జిల్లా అధికారి ఎం.ఏ అలీమ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వర్రావు, బీరోలు సొసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డి, ఎంపీపీ మంగీలాల్, మండల పార్టీ అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, స్వర్ణకుమారి, బండి జగదీష్, తమ్మినేని నవీన్, అంబటి సుబ్బారావు, మద్ది మల్లారెడ్డి, బెల్లం శ్రీనివాసరావు, మొక్క శేఖర్ గౌడ్, బొందయ్య తదితరులు ఉన్నారు.


Similar News