మైనర్ బాలికలకు కల్యాణ లక్ష్మిని మంజూరు చేసిన అధికారులు...?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో... Special News of Kalyana Laxmi Scheme Implementation
దిశ, వైరా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో వైరా తహశీల్దార్ కార్యాలయ అధికారులు అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా ఈ పథకాల కోసం లబ్ధిదారులను రెవెన్యూ అధికారులు ఎంపిక చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను మైనర్ బాలికలకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారనే ఆరోపణ బలంగా ఉన్నాయి. ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన యువతులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కేటాయించాలని నిబంధనం ఉంది. అయితే వైరా మండలంలో మైనర్ బాలికలకు పలు గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా వివాహాలు జరిగాయి. మండలంలోని సుమారు 6 గ్రామాల్లో వివాహాలు జరిగిన పదుల సంఖ్యలో మైనర్ బాలికలకు తహశీల్దార్ కార్యాలయ అధికారులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను మంజూరు చేశారు.
వివాహం జరిగిన మైనర్ బాలికల స్టడీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి వాటి ఆధారంగా ఆధార్ కార్డుల్లో వివాహ సమయానికి 18 సంవత్సరాలు నిండినట్లు అప్డేట్ చేయించారు. ఈ వ్యవహారంలో దళారులతోపాటు తహశీల్దార్ కార్యాలయ అధికారుల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతుంది. మైనర్ బాలికలకు కళ్యాణ లక్ష్మి పథకానికి ఎంపిక చేసిన అధికారులు అందిన కాడికి దండుకున్నారని విమర్శలు ఉన్నాయి. మైనర్ బాలికలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేటాయించేందుకు తహశీల్దార్ కార్యాలయ అధికారులు తప్పు మీద తప్పు చేశారు. మైనర్ బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం... ఇది తెలిసి కళ్యాణ్ లక్ష్మి మంజూరు చేయటం మొదటి తప్పు... పాఠశాలలోని స్టడీ ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేయడం రెండో తప్పు... ఫోర్జరీ ధృవపత్రాలతో ఆధార్ కార్డులో వయసును పెంచటం మూడో తప్పు... ఇలా తప్పుడు ధృవపత్రాలతో తహశీల్దార్ కార్యాలయ అధికారులు కల్యాణ లక్ష్మి పథకాన్ని మంజూరు చేసి ప్రభుత్వ నిధులను దుర్విని చేయడం.. నాలుగో తప్పు... తహశీల్దార్ కార్యాలయ అధికారులు ఇన్ని తప్పులు చేసి ప్రభుత్వ పథకాల లక్ష్యాన్ని నీరుగారిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.