సాంబాయిగూడెంలో మట్టి దందా
మణుగూరు మండల కేంద్రంలోని సాంబాయిగూడెం అడవిలో గత కొన్ని రోజుల నుంచి జోరుగా అక్రమ మట్టి దందా జరుగుతోంది.
దిశ, మణుగూరు: మణుగూరు మండల కేంద్రంలోని సాంబాయిగూడెం అడవిలో గత కొన్ని రోజుల నుంచి జోరుగా అక్రమ మట్టి దందా జరుగుతోంది. బీటీపీఎస్ ప్లాంట్‌కు సంబంధిచిన ఓ యాష్ ప్లాంట్ కాంట్రాక్టర్ గత కొన్ని రోజులుగా ఇష్టం వచ్చినట్లు మట్టి తోలకాలు చేస్తూ.. కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నాడు. బీటీపీఎస్ ప్లాంట్ పనుల పేరు మీద గత నెల రోజులుగా ఫారెస్ట్ మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడు. ఫారెస్ట్ భూములకు ఎఫ్ఆర్వో పట్టాలు ఉన్న కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టి తోలకాలు చేయొద్దు. కానీ కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. ప్రభుత్వ సంపదను మింగేస్తున్నాడు. గత నెల రోజులు నుంచి సాంబాయిగూడెం ఫారెస్ట్ అడవిలో భారీ యంత్రాలను దించి, లారీలతో జోరుగా మట్టిని తోలుతున్నాడు. దీంతో అధికారులెవరు.. పట్టించుకోకపోవడంతో కోట్ల రుపాయల మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా అమ్ముకుంటున్నాడు. కాంట్రాక్టర్ పట్టపగలే మట్టిని తరలిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫారెస్ట్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా తమ కండ్ల ముందే లారీల ద్వారా టన్నుల కొద్ది మట్టి వెళుతున్నా.. పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.
ఫారెస్ట్ భూములను కరిగిస్తున్నారు.
సాంబాయిగూడెం ఫారెస్ట్ అడవిలో అక్రమ మట్టి దందా యథేచ్ఛగా జరుగుతోంది. అనుమతులు లేవని ఒక పక్క సంబంధించిన అధికారులు చెబుతున్నా.. కాంట్రాక్టర్ మాత్రం ఫారెస్ట్ సంపదను అందినకాడికి దోచుకుంటున్నాడు. ఇంత జరుగుతున్న కాంట్రాక్టర్‌పై అధికారులెవరూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీని బట్టి చూస్తే సాంబాయిగూడెం ఫారెస్ట్ అడవిలో ఎన్ని కోట్ల దందా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా అధికారుల సాయంతోనే ఫారెస్ట్ అడవిలో మట్టి దందా జరుగుతోందని కొన్ని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ లక్షల రూపాయలు కొంతమంది అధికారులకు చెల్లించాడనే వదంతులు వినపడుతున్నాయి. అందుకే స్థానిక, జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, అక్రమంగా తరలిస్తున్న మట్టి, భారీ యంత్రాలను, లారీలను సీజ్ చేసి యాష్ ప్లాంట్ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి, ఇప్పటి వరకు ఎన్ని ట్రిప్పులు అక్రమంగా తోలారో లెక్క తేల్చి వాటికి జరిమానా కట్టించాల్సిందిగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.