నరికేస్తూ.. తరలిస్తూ..
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం గోధుమ వాగు బ్రిడ్జి పక్కనున్న టేకు చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేస్తూ అర్ధరాత్రి గుట్టుగా తరలిస్తున్నారు.
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం గోధుమ వాగు బ్రిడ్జి పక్కనున్న టేకు చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేస్తూ అర్ధరాత్రి గుట్టుగా తరలిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఓ వైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున టేకు మొక్కలతో పాటు పలు రకాల మొక్కలు నాటుతున్నా.. మరోవైపు ఆ చెట్లు నరికివేతకు గురికావడం కలవర పెడుతోంది. అటవీ సంపద దోపిడీకి గురికాకుండా చూడాల్సిన బాధ్యత అటవీశాఖ పై ఉన్నా.. కానీ ఆ శాఖలోని కొందరు సిబ్బంది బాధ్యతగా వ్యవహరించడం లేదనే చర్చ జరుగుతున్నది. గతంలోనూ టేకు కలప నరికివేతకు గురై.. భారీగా తరలిపోయిన విషయాన్ని కొందరు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా టేకు కలప కలప స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్మగ్లర్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా దందా సాగిస్తున్నారు.
దిశ ప్రతినిధి, కొత్తగూడెం : అటవీ సంపద నరికివేతకు గురికాకుండా దోపిడీ కాకుండా చూడాల్సిన బాధ్యత అటవీశాఖ పై ఎంతైనా ఉంది. కానీ ఆ శాఖలోని కొందరు సిబ్బంది బాధ్యతగా వ్యవహరించడం లేదనేది ఇక్కడ జరుగుతున్న కలప స్మగ్లింగ్ తీరు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం గోధుమ వాగు బ్రిడ్జి పక్కనున్న ఖాళీ స్థలంలో భారీగా టేకు చెట్లు ఉన్నాయి. అయితే ఈ టేకు చెట్ల పై కొందరి స్మగ్లర్ల కన్ను పడింది. రాత్రి సమయంలో కలప దొంగలు మిషన్లతో నరికివేసి ఆటోలో తరలిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ టేకు కలప నరికివేతకు గురిగాడమే కాకుండా భారీగా తరలిపోయిన విషయాన్ని కొందరు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన విషయం అందరికీ తెలిసిందే.
అయినప్పటికీ అర్ధరాత్రి వేళల్లో టేకు వృక్షాల నరికివేత మాత్రం యథేచ్ఛగా సాగుతుండటం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా వాగు పక్కనే ఉన్న శ్మశాన వాటికలో సైతం పెద్దపెద్ద టేకు వృక్షాలు ఉన్నా.. అవి గతంలో నరికివేతకు గురయ్యాయి. ఫారెస్ట్ కార్యాలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే టేకు కలప దందా జోరు జరగడం పలుఅనుమానాలకు తావిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక దిక్కు ప్రభుత్వం పెద్ద ఎత్తున టేకు చెట్లతో పాటు పలు రకాల చెట్లు నాటుతున్నా.. మరో పక్కన చెట్లు నరికివేతకు గురి కావడం కలవర పెడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థలంలో శ్మశాన వాటికలో ఉన్న టేకుచెట్లు నరికివేత గురి కావడం చూస్తే దీని వెనకాల పెద్దల హస్తం ఉండే ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా రామవరం గోధుమ వాగు పక్కన ఖాళీ స్థలంలో ఉన్న టేకుచెట్లు నరికివేతకు గురి కావడం చూసిన సామాజిక కార్యకర్త బానోత్ హరినాయక్ మంగళవారం 100కు సమాచారం అందించారు.