Collector Jitesh V Patil : భద్రాద్రి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది.

Update: 2024-07-22 09:19 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆదివారం సాయంత్రం 6.51 గంటలకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. క్రమేపీ పెరుగుతూ, సోమవారం ఉదయం 6 గంటలకు 46.50 అడుగులకు చేరింది. మధ్యాహ్నం 2.04 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసి అధికారులను అప్రమత్తం చేశారు.

ఏజెన్సీలోని రహదారులపైకి గోదావరి నీటితో పాటు వరద నీరు చేరుకోవడంతో, ఎవరూ కూడా ఆ దారి గుండా ప్రయాణించే వీలు లేకుండా పోలీసులు రహదారికి అడ్డంగా ట్రాక్టర్లు పెట్టారు. గోదావరి ఉపనదులు ఇంద్రావతి, ప్రాణహిత పొంగి పొర్లడమే కాకుండా కాళేశ్వరం నుంచి కూడా భారీగా వరద నీరు తరలి వస్తుండటంతో మంగళవారం భద్రాద్రి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీలోని పలు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Tags:    

Similar News