మూడు రోజులుగా చీకట్లో మగ్గుతున్న సంతబజార్..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైరాలో విద్యుత్ విజయోత్సవం నిర్వహించే వేళ విద్యుత్ వినియోగదారులు ఆందోళన బాటపట్టారు.

Update: 2023-06-05 10:00 GMT

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైరాలో విద్యుత్ విజయోత్సవం నిర్వహించే వేళ విద్యుత్ వినియోగదారులు ఆందోళన బాటపట్టారు. మూడు రోజులుగా చీకట్లో మగ్గుతున్న వైరాలోని సంతబజార్ కు చెందిన విద్యుత్ వినియోగదారులు ఆదివారం అర్ధరాత్రి రోడ్డెక్కారు. వైరాలోని పాత బస్టాండ్ సెంటర్లో జాతీయ రహదారి పై అర్ధరాత్రి 11:30 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ వినియోగదారులు ఆందోళన చేశారు. జాతీయ రహదారి పై వినియోగదారులు రాస్తారోకో చేసి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యపు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరాలోని సంతబజార్లో ఈనెల 2 వ తేదీ రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సంత బజార్ లో ఉన్న 100 కేవి ట్రాన్స్ఫార్మర్ పై లోడు పడటంతో 2వ తేదీ రాత్రి నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్ పొగలు కమ్ముతుంది. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో విద్యుత్ సమస్య తీవ్రతరంగా మారింది. పగలు అరకొరగా పొగలు కమ్ముతున్న ట్రాన్స్ఫార్మర్ నుంచే విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

గత మూడురోజులుగా రాత్రుల్లో ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. ఆదివారం రాత్రి 100 కేవి ట్రాన్స్ఫార్మర్ పొగలు కమ్మి మంటలు వ్యాపించాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సంతబజారు వాసులు ఆందోళనకు దిగారు. గత మూడు రోజులుగా తమ ప్రాంతంలో విద్యుత్తు లేకపోయినా కనీసం అధికారులు పట్టించుకోవటం లేదని ఆ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విద్యుత్ అధికారులను పలుసార్లు కలిసి సమస్యను విన్నవించిన కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా తాము చీకట్లో మగ్గుతున్నామని విద్యుత్ వినియోగదారులు తమ ఘోషను వెళ్లబుచ్చారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 160 కె వి ట్రాన్స్ఫార్మర్ ను టీఎస్ఎన్పిడిసిఎల్ మంజూరు చేసిన ఆ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయకుండా అధికారులు తమకు నరకం చూపిస్తున్నారని వినియోగదారులు మండిపడ్డారు. విద్యుత్ విజయోత్సవం ఏర్పాట్ల పేరుతో ఆదివారం కూడా నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయలేదు . దీంతో ఆగ్రహానికి గురైన ఆ ప్రాంతవాసులు ఆదివారం అర్ధరాత్రి రోడ్డెక్కి తమ నిరసన తెలిపారు.

అదే సమయంలో ఖమ్మం నుంచి వైరా వస్తున్న వైరా ఏసిపి రెహమాన్, ఎస్సై శాఖమూరి వీరప్రసాద్ ఆందోళన చేస్తున్న విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను విద్యుత్తు వినియోగదారులు ఏసీపీకు వివరించారు. దీంతో స్పందించిన ఏసీపీ విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మూడు రోజులుగా విద్యుత్తు లేక ఇబ్బంది పడుతున్న సంత బజార్ వాసుల సమస్య ఎందుకు పరిష్కరించలేదని ఏసిపి విద్యుత్ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. సోమవారం ఉదయం కల్లా సమస్యను పరిష్కరించాలని ఏసీపీ విద్యుత్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎసిపి విద్యుత్ వినియోగదారులతో మరోసారి మాట్లాడారు. సోమవారం ఉదయం తప్పనిసరిగా సమస్య పరిష్కారం అవుతుందని, లేకుంటే తన వద్దకు రావాలని ఏసీపీ వినియోగదారులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. దింతో విద్యుత్ వినియోగదారులు ఆందోళన విరమించారు.

Tags:    

Similar News