అనుమతులు శూన్యం.. అందిన కాడికి దోపిడీ

అంగడిలో పుట్టగొడుగుల్లా ఎలాంటి అనుమతులు లేకుండా చైనా ట్రాక్ హార్వెస్టర్లు వెలుస్తున్నాయి....

Update: 2024-11-19 02:32 GMT

దిశ, వైరా: అంగడిలో పుట్టగొడుగుల్లా ఎలాంటి అనుమతులు లేకుండా చైనా ట్రాక్ హార్వెస్టర్లు వెలుస్తున్నాయి. కనీస అనుమతులు లేని ఈ హార్వెస్టర్లను తెలుగు రాష్ట్రాల్లో డీలర్లు విక్రయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా ట్రాక్ హార్వెస్టర్లను విక్రయిస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. ఏదైనా ఒక హార్వెస్టర్‌ను మార్కెట్లోకి తీసుకురావాలంటే భారత ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. అయితే ఆ నిబంధనలను గాలికి వదిలేస్తూ చైనా నుంచి అతి చౌకగా హార్వెస్టర్లను తెలుగు రాష్ట్రాలకు తీసుకువచ్చి విక్రయిస్తూ డీలర్లు తమ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఇటీవల ఇదే తరహాలో ఓ ట్రాక్ హార్వెస్టర్ మార్కెట్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా ఈ హార్వెస్టర్ విక్రయాలు కొనసాగుతున్నాయి.

నిబంధనలుు ఇవే..

హార్వెస్టర్‌ను మార్కెట్లో విక్రయించాలంటే తప్పనిసరిగా హర్యానాలోని బుదిని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ నేషనల్ టెస్టింగ్ సెంటర్ నుంచి టెస్ట్ రిపోర్ట్ అప్రూవల్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా హార్వెస్టర్ బండికి సంబంధించిన అన్ని విడిభాగాల కొలతలు ఈ టెస్టింగ్ సెంటర్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టింగ్ సెంటర్లో కోత కోసిన తర్వాత ఆ హార్వెస్టర్‌లో లోపాలను టెస్టింగ్ సెంటర్ వారు పరిశీలించి పలు సవరణలకు ఆదేశిస్తారు. ఈ టెస్టింగ్ రిపోర్టర్ అప్రూవల్ ఉంటేనే ఆర్బీఐ రూల్ ప్రకారం ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఫైనాన్స్ కల్పిస్తాయి. అంతేకాకుండా సదరు హార్వెస్టర్ కోసిన పంట క్వింటాకు ఎంత ధాన్యం లాస్ అవుతుందో అనే సర్టిఫికెట్ కూడా ఉండాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఇన్వాయిస్ రేట్‌కు హార్వెస్టర్‌ను విక్రయించాల్సి ఉంటుంది. ఇలా అనేక నిబంధనలు ఉన్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ డీలర్ బుకింగ్ చేస్తున్నారు.

కానరాని సర్వీస్ సెంటర్..

ఇటీవల కల్లూరు మండలంలోని పాయపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి విజయవాడ కేంద్రంగా అనుమతులు లేని చైనా హార్వెస్టర్‌ను విక్రయించారు. అయితే హార్వెస్టర్‌లో పలు సమస్యలు వచ్చినప్పటికీ కనీసం సర్వీస్ సౌకర్యం కూడా ఇవ్వడం లేదని సదరు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కనీసం హార్వెస్టర్‌కు సర్వీసింగ్ సెంటర్ లేకుండా విక్రయిస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. ఇన్వాయిస్ రేటు రూ.21లక్షలు ఉండగా రూ.23లక్షలకు తనకు హార్వెస్టర్‌ను విక్రయించారని యజమాని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న చైనా హార్వెస్టర్ల డీలర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News