దిశ ఎఫెక్ట్.. వైరా విద్యుత్ శాఖలో " దిశ కథనాల" ప్రకంపనలు
వైరా డివిజన్ విద్యుత్ శాఖలో "దిశ కథనాల" ప్రకంపనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
దిశ, వైరా : వైరా డివిజన్ విద్యుత్ శాఖలో "దిశ కథనాల" ప్రకంపనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ శాఖలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరిస్తూ ఇటీవల దిశ దినపత్రికలో "విద్యుత్ శాఖ ఉద్యోగులా... మజాకా", "విద్యుత్ విజయోత్సవం సరే... సమస్యల పరిష్కారమేది..?", "మూడు రోజులుగా కరెంటు బంద్.. చీకట్లో మగ్గుతున్న సంత బజార్ ", "విద్యుత్ విజయోత్సవం వేళ.. రోడ్డెక్కిన వినియోగదారులు " అనే వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన ఎన్పీడీసీఎల్ కు చెందిన ఓ డైరెక్టర్ రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖలోని జిల్లా, వైరా డివిజన్ శాఖ అధికారుల పై ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
విద్యుత్ వినియోగదారుల సమస్యల పై అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం వల్ల ఎన్పీడీసీఎల్ కు చెడ్డ పేరు వస్తుందని డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా పట్టణంలోనే ఇన్ని సమస్యలు ఉంటే మీరు ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని వినియోగదారుల సమస్యలన్నిటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్న విద్యుత్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని మండిపడ్డారు. వెంటనే వైరాలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. లేనిపక్షంలో శాఖపరంగా తీసుకునే చర్యల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దిశ పత్రికలో వచ్చిన వార్తా కథనాల్లో వాస్తవమైన సమస్యల సమాచారముందని డైరెక్టర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. యుద్ధ ప్రాతిపదికన ఆ సమస్యలను పరిష్కరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన అధికారులకు హాట్ వార్నింగ్ ఇచ్చారు.