Khammam: మున్నేరు వాగు వరదలో ఏడుగురు.. కాసేపట్లో రెస్క్యూ ఆపరేషన్
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలం అవుతోంది....
దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు మున్నేరు వాగుకు సైతం వరద నీరు పోటెత్తింది. దీంతో వాగు నీటి మట్టం 32 అడుగులకు చేరింది. వరద నీరు పొంగిపొర్లుతోంది. దీంతో వాగు పరివాహక పాంతాల్లోకి వరద భారీగా చేరుకుంటోంది. పెద్దతండా, మోతీనగర్, బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్‌లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఆర్తనాదాలు చేస్తున్నారు. వరదలో చిక్కుకున్న కొంతమందిని స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
స్థానిక పద్మానగర్‌లో ఏడుగురు వ్యక్తులు ఓ ఇంట్లో చిక్కుకున్నారు. బిక్కు బిక్కు మంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల కాపాడే ప్రయత్నం చేశారు. అయితే మున్సిపల్ సిబ్బంది ప్రయాణించే స్టీమర్ వరద నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో తిరిగి వాపస్ వెళ్లేపోయారు. దీంతో వరద బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, జాలర్ల, రోప్ సిబ్బందిని రంగంలోకి దించుతున్నారు. రాజమండ్రి నుంచి ఎన్డీఆర్ సిబ్బందిని రప్పిస్తున్నారు. కాసేట్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించనున్నారు.
మరోవైపు ఖమ్మం 47వ డివిజన్ మంచికంటి నగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీ చుట్టూ వరద నీరు నిలిచిపోయింది. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వరద ప్రాంతంలో పర్యటించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. కాసేపట్లో వీరిని కూడా ఎన్డీఆర్ బృందం సురక్షిత ప్రాంతానికి తరలించనున్నారు.