గ్రామకంఠ భూమికి రిజిస్ట్రేషన్

వైరా మున్సిపాలిటీ పరిధిలోని పల్లిపాడు గ్రామంలో ఉన్న 301 సర్వే నెంబర్ లోని గ్రామకంఠ భూమికి రిజిస్ట్రేషన్ చేశారు.

Update: 2024-07-05 13:59 GMT

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలోని పల్లిపాడు గ్రామంలో ఉన్న 301 సర్వే నెంబర్ లోని గ్రామకంఠ భూమికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ గ్రామ కంఠ భూమిలోని 240 గజాల స్థలాన్ని జంపాల ఉపేంద్ర అనే మహిళ గత నెల 20వ తేదీన తన కుమారుడు జంపాల ప్రభాకర్ కు వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. ఈ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ తో ఆటోమేటిక్ సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా

     ఆ ఇంటి నెంబర్ ఉపేంద్ర పేరు నుంచి ప్రభాకర్ పేరుకు బదిలీ అయింది. పల్లిపాడులోని గ్రామ కంఠ భూమికి నిబంధనలకు విరుద్ధంగా వైరా మున్సిపాలిటీ అధికారులు ఇంటి నెంబర్ కేటాయించిన విషయాన్ని దిశ బహిర్గతం చేసిన తరువాత 3 రోజులకు ఆ ఇంటి నెంబర్, పి టిన్ ఆధారంగా ఈ రిజిస్ట్రేషన్ చేయటం విశేషం. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమికి ఇంటి నెంబర్ కేటాయింపుతో పాటు ఏకంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఇంటి నెంబర్, పి టిన్ ఆధారంగా రిజిస్ట్రేషన్.......

పల్లిపాడులోని గ్రామకంఠ భూమికి వైరా మున్సిపాలిటీ అధికారులు గత నెలలో ఇందిరమ్మ ఇంటి పట్టా ఆధారంగా ఇంటి నెంబర్ ను కేటాయించారు. గ్రామకంఠ భూమిలో రేకుల షెడ్డు వేసుకుని నివాసం ఉంటున్న జంపాల ఉపేంద్ర అనే మహిళకు అధికారులు ఇందిరమ్మ ఇంటి పట్టా ఆధారంగా ఇంటి నెంబర్ ను కేటాయించడం విశేషం. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం

    జరిగిందా...? లేదా...? అనే పరిశీలన చేయకుండానే అధికారులు ఇంటి నెంబర్ ను కేటాయించారు. ఉపేంద్ర తన పేరుపై వచ్చిన ఇంటి నెంబర్ 3-34/A/1/A/1, పి టిన్ నెంబర్ - 1212301115 ఆధారంగా వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 240 గజాల స్థలాన్ని తన కుమారుడు ప్రభాకర్ కు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ప్రభాకర్ కు 2503/2024 డాక్యుమెంట్ నెంబర్ పై గ్రామకంఠ భూమి రిజిస్ట్రేషన్ అయింది.

మూడవ రోజే రిజిస్ట్రేషన్......

ఈ గ్రామ కంఠ భూమికి వైరా మున్సిపాలిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నెంబర్ కేటాయించిన విషయాన్ని దిశ బహిర్గతం చేసింది. గత నెల 18వ తేదీన దిశ వెబ్ సైట్ లో, గత నెల 19వ తేదీన దిశ దినపత్రికలో "గ్రామ కంఠ భూమికి ఇంటి నెంబర్" అనే వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ వార్త కథనాలు ప్రచురితమైన మూడవ రోజే ఈ రిజిస్ట్రేషన్ చేయించటం విశేషం. ఈ వార్త కథనం ప్రచురించిన వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఉంటే ఈ గ్రామకంఠ భూమి రిజిస్ట్రేషన్ చేసే వీలు ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కానీ అధికారులు తాము ఇందిరమ్మ ఇంటి పట్టా ఆధారంగా రేకుల షెడ్డు కు ఇంటి నెంబర్ ను నిబంధనల ప్రకారమే కేటాయించామని

    తమను తాము సమర్ధించుకోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. ఈ గ్రామకంఠ భూమిలో పలువురు రేకుల షెడ్లు వేసుకుని తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ను ఆసరాగా చేసుకుని మిగిలిన వారు కూడా రిజిస్ట్రేషన్ లు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామ కంఠ భూమికి ఇంటి నెంబర్ కేటాయింపు, రిజిస్ట్రేషన్ లపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వైరా సబ్ రిజిస్టర్ కరుణ ను దిశ వివరణ కోరగా ఇంటి నెంబర్, పి టిన్ నెంబర్ ఉండటంతోనే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశామని చెప్పారు. ఈ వ్యవహారంలో తమ తప్పిదం లేదని వివరణ ఇచ్చారు. 


Similar News