రేగా.. ఒళ్లు దగ్గర పెట్టుకో : ఎమ్మెల్యే వీరయ్య ధ్వజం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య హెచ్చరించారు.
దిశ, భద్రాచలం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య హెచ్చరించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గం సమస్యల గురించి అనేక సార్లు ముఖ్య మంత్రికి మొరపెట్టుకున్నా ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని, ప్రతిపక్షం ఎమ్మెల్యే కావడంతో కావాలని కక్ష పూరితంగా వ్యవహరించారని అన్నారు. వాళ్ల తప్పులు కప్పిపెట్టి నాకు భద్రాచలం మీద ప్రేమ లేదని, అభివృద్ధిని అడ్డుకుంటున్నానని రేగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
కాంగ్రెస్ నుండి గెలిచి ఊసరవెల్లి లాగా పార్టీ మార్చి సీనియర్ ఎమ్మెల్యే ని తనను విమర్శించే అర్హత రేగాకు లేదని హితవు పలికారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. భద్రాచలంలో ఐదు పంచాయతీలు కలపాలని ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానిని వేడుకున్నా ఫలితం లేదని తెలిపారు. ఆంధ్రలో కలిసిన ఐదు పంచాయతీల కొరకు ప్రయత్నం చేయకుండా, భద్రాచలం ను ఐలాండ్ గా మార్చిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు.
రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు తెచ్చే తీరిక లేని ముఖ్యమంత్రి భద్రాద్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు తెలంగాణ ప్రభుత్వానికి భద్రాచలం అనే పట్టణం ఉందని తెలుసా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ నేనని, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.