పోడు వ్యవసాయానికి విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి : కొత్తగూడెం కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కోసం

Update: 2025-03-18 12:02 GMT
పోడు వ్యవసాయానికి విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి : కొత్తగూడెం కలెక్టర్
  • whatsapp icon

దిశ, కొత్తగూడెం : జిల్లావ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కోసం విద్యుత్తు లైన్ ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పోడు వ్యవసాయానికి విద్యుదీకరణ, ఉపాధి హామీ పనుల పురోగతి, త్రాగు నీటి సంరక్షణ చర్యలు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు తవ్వకాలు, మీసేవ దరఖాస్తులు, ధరణి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు పట్టాలు పొందిన రైతులు వ్యవసాయం చేయడానికి వీలుగా నీటి వసతి కల్పించుటకు గాను వ్యవసాయ భూములకు విద్యుదీకరణ కు అవసరమైన లైన్ల ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో తగిన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఎక్కడ అయితే విద్యుత్ లైన్లు అవసరమో పంచాయతీ సెక్రటరీ గుర్తించి, విద్యుత్ లైన్ల మంజూరుకు అవసరమైన పత్రాలు మరియు గ్రామసభ ఆమోదం తో అటవీశాఖ అధికారులకు తెలపడం ద్వారా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.

విద్యుత్ లైన్ల ఏర్పాటు సాధ్యం కానీ ప్రదేశాలలో అటవీ శాఖ అధికారుల ఆమోదంతో బావులు తవ్వి సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు ద్వారా పోడు సాగుకు నీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. పోడు భూములలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన రైతులకు నీటి సౌకర్యం కల్పించేందుకు గాను విద్యుత్ లైన్ లో ఏర్పాటు సహకరించాలని అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ ను కలెక్టర్ కోరారు. జిల్లాలోని అన్ని మండల అటవీ శాఖ రేంజర్లు అటవీ శాఖ పరిధిలో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టవలసిన పనులను గుర్తించి నివేదికలు అందించటం ద్వారా త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ భూముల్లో ఫామ్ పౌండ్ ( నీటి గుంటలు) తవ్వకాల కోసం రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో బోర్ ద్వారా సాగు చేసే రైతులు వివరాలు రేపటిలోగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. బోర్ ద్వారా వ్యవసాయం చేసే ప్రతి రైతు వ్యవసాయ భూమిలో కచ్చితంగా నీటి గుంటల నిర్మాణం చేపట్టాల్సిందే అని కలెక్టర్ స్పష్టం చేశారు. జల శక్తి అభియాన్ లో భాగంగా పంచాయతీ పరిధిలోని ప్రతి కార్యాలయాల్లో, పాఠశాలల్లో, రోడ్డు పక్కన ప్రాంతాలు గుర్తించి ఇంకుడు గుంతలు ఎన్ని నిర్మాణం చేపట్టవచ్చునో ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పంచాయతీ పరిధిలో ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టేలా పంచాయతీ సెక్రటరీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేటువంటి బతుకమ్మ పండుగలో పూజకు ఉపయోగించే తంగేడు పువ్వు జిల్లాలో ఎక్కడా కనపడటం లేదని, ప్రజలకు ఉపయోగపడే మొక్కలను పెంచాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నర్సరీలలో ఇప్ప, కరక్కాయ, చింత, విష ముష్టి, కుంకుడు, తంగేడు వంటి మొక్కలను పెంచాలని సూచించారు. మొక్కలు పెంచడానికి వీలుగా గింజల సేకరణ చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గింజల సేకరణలో అత్యధికంగా గ్రామస్థాయిలో 1000, మండల స్థాయిలో 5000 మరియు జిల్లాస్థాయిలో 50,000 బహుమతిగా ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు పాఠశాలల నుండి ప్రకృతి పర్యావరణం పట్ల అవగాహన కల్పించాలన్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మునగ సాగు, అజొల్ల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, చేపల పెంపకం మరియు వెదురు సాగుపై అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు రైతులు తమకు ఈ పంటల గురించి ఎవరూ చెప్పలేదని, అవగాహన కల్పించలేదని దృష్టికి వచ్చిందని, వ్యవసాయ అధికారులు పద్ధతి మార్చుకోని క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.

జిల్లావ్యాప్తంగా పెండింగ్ ఓటర్ మార్పులు, చేర్పులు నూతన ఓటర్ దరఖాస్తులు, మీసేవ కేంద్రాలలో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ ధరణి పెండింగ్ దరఖాస్తులు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉన్న పెండింగ్ ధరణి దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటి అందేలా త్రాగు నీటి సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, అడిషనల్ డి ఆర్ డి ఓ రవి, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, మిషన్ భగీరథ నళిని సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News