పొంగులేటి అడుగులు బీజేపీ వైపే..
బీఆర్ఎస్ పార్టీను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు బీజేపీ వైపే పడుతున్నాయి..
దిశ, వైరా: బీఆర్ఎస్ పార్టీను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు బీజేపీ వైపే పడుతున్నాయి. శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరటం లాంచన ప్రాయంగానే మిగిలిందని సమాచారం. బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్టిపి పార్టీలో చేరతారని ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని 10 స్థానాల్లో తన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపుతానని, అందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఇటీవల ప్రకటించారు. పది నియోజకవర్గాల్లో పొంగులేటి ఆయన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ శూన్యత ఉన్న బీజేపీ పార్టీ నుంచే మెండుగా అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు, ఆశావాహులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంత పోటీతత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి చేరితే ఆయన అభ్యర్థులు పదిమందిని ఎన్నికల బరిలో ఉంచే అవకాశం ఉండదు.
వైయస్ ఆర్టిపిలో రాజకీయ శూన్యత ఉన్నా.. ఆ పార్టీకి రాష్ట్రంలో ఆదరణ లేకుండా పోయింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి జిల్లాలో బలమైన నాయకుడు కరువయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు పొంగులేటి అడుగులు వేస్తున్నారు. పొంగులేటి బీజేపీలో చేరితే స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా నెరవేరుతుందని బలంగా నమ్ముతున్నారని సమాచారం. రాజకీయాలకు సమాంతరంగా కాంట్రాక్టు పనులు చేస్తున్న పొంగులేటికి బీజేపీలో చేరితేనే రాజకీయ అండతోపాటు ఆర్థిక పరిపుష్టి లభించే అవకాశం ఉంది. ఈ విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లేదా వైయస్ఆర్టిపి పార్టీలో చేరే అవకాశం ఒక్క శాతం కూడా ఉండదనేది స్పష్టమవుతుంది. కానీ, శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో మాత్రం తన అభ్యర్థిని నిలబెట్టే విషయమై పునరా ఆలోచనలో పడినట్లు సమాచారం. తనకు రాజకీయంగా వెన్నుదండుగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో పొంగులేటి పరోక్షంగా షర్మిలకు పాలేరు నియోజకవర్గంలో సహకరిస్తారని రాజకీయ చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా పొంగులేటి పయనం బీజేపీ వైపే అని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రతికూల పరిస్థితులు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లావ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ఎన్నికల బరిలో ఉంచుతానని స్పష్టం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ కు వెళ్లే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. 10 నియోజకవర్గాల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండగా మిగిలిన 8 నియోజకవర్గాల్లో అనేకమంది ఆశావాహులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పొంగులేటి తన అభ్యర్థిగా మట్టా దయానందును ప్రకటించే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే సత్తుపల్లిలో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అశ్వఅశ్వారావుపేటలో జారె ఆదినారాయణ తన అభ్యర్థిగా పొంగులేటి ఇప్పటికే ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పినపాక నియోజకవర్గం లో పొంగులేటి పాయం వెంకటేశ్వర్లు తన అభ్యర్థిగా ప్రకటించగా, కాంగ్రెస్ నుంచి ఏకంగా ఏడుగురు అభ్యర్థులు టికెట్ను ఆశిస్తున్నారు. పినపాక నుంచి కాంగ్రెస్ లో టికెట్ కోసం కాటబోయిన నాగేశ్వరరావు, శ్రీవాణి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం నరేష్, కొమరం లక్ష్మణరావు, బట్ట విజయ్ గాంధీ, డాక్టర్ సంతోష్ కుమార్ పోటీ పడుతున్నారు. మధిర నుంచి తన అభ్యర్థిగా పొంగులేటి కోటా రాంబాబు పేరు ప్రకటించగా.. అక్కడ మధిర ఎమ్మెల్యేగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైరాలో భానోత్ విజయభాయిని తన అభ్యర్థిగా పొంగులేటి దాదాపు ఖరారు చేశారు.
ఇక్కడ కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం మాలోత్ రాందాస్ నాయక్, ధరావత్ రామ్మూర్తి నాయక్, బానోత్ బాలాజీ నాయక్ పోటీ పడుతున్నారు. ఇల్లందులో కొరం కనకయ్యను పొంగులేటి తన అభ్యర్థిగా ప్రకటించారు. ఇల్లందు నుంచి కాంగ్రెస్ లో టికెట్ కోసం చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవిబాబు, భూక్యా రామచంద్రనాయక్, యాకయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొత్తగూడెంలో పొంగులేటి తన అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ పేరును తెరపైకి తెస్తున్నారని ప్రచారం జరుగుతుంది. లేకుంటే అక్కడ సెకండ్ ఆప్షన్ గా మువ్వా విజయబాబును పోటీ చేయించాలనే ఆలోచనలో పొంగలేటి ఉన్నారని తెలిసింది. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎడవల్లి కృష్ణ, పోట్ల నాగేశ్వరావు టికెట్‌ను ఆశిస్తున్నారు. భద్రాచలంలో పొంగులేటి తెల్లం వెంకట్రావును తన అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే భద్రాచలంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఉండనే ఉన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా మువ్వా విజయబాబు ఎన్నికల బరిలో నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా. అయితే ఇటీవల ఖమ్మం వచ్చిన రేణుక చౌదరి ఖమ్మం అసెంబ్లీ నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పాలేరులో కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ పొంగులేటి తన అభ్యర్థిని ప్రకటించే విషయమై సస్పెన్షన్ నెలకొంది. ఇక్కడి నుంచి వైయస్ షర్మిల వైయస్ ఆర్ టి పి పార్టీ నుంచి పోటీ చేస్తున్ననని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి షర్మిల కు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మద్దతిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా.
వైయస్ఆర్టిపిలో చేరేందుకు పొంగులేటి విముఖత
రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ కొనసాగుతున్న వేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్సాఆర్ టీపీ చేరేందుకు విముకుత చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పార్టీలో రాజకీయ శూన్యత ఉందనేది ప్రతి ఒక్కరికి స్పష్టమవుతుంది. రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పార్టీలో పేరు, ప్రతిష్టలు ఉన్న నాయకులు ఒక్కరు కూడా చేరలేదు. ఇలాంటి పార్టీలోకి పొంగులేటి చేరి చూస్తూ చూస్తూ చేతులు కాల్చుకోలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే వైయస్ కుటుంబం మీద ఉన్న ప్రేమ మమకారంతో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల పోటీ చేసే పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ఆమెకు మద్దతు పలికే ఛాన్స్ మెండుగా ఉంది. వైయస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నా.. తెలంగాణ ప్రజలను ఆకర్షించలేకపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి వైఎస్ఆర్టీపీ వైపు వెళ్లే అవకాశం కనిపించడం లేదు.
బీజేపీతోనే పొంగులేటికి భవిష్యత్తు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీతోనే పొంగులేటి భవిష్యత్తు కనిపిస్తోంది. బిజెపి కు జిల్లాలో ప్రస్తుతం రాజకీయ శూన్యత కనిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలోకి పొంగులేటి చేరితే తాను అనుకున్న విధంగా పది నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపేందుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు పొంగులేటికి కేంద్ర సహకారం కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంది. మరోవైపు వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న పొంగులేటికి కేంద్ర ప్రభుత్వం ద్వారా కాంట్రాక్టుల రూపంలో ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ లేదా వైయస్సార్ టీపీ పార్టీలో చేరితే రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తో పాటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా పొంగులేటిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇన్ని రాజకీయ సమీకరణల దృష్ట్యా పొంగులేటి బిజెపి వైపు అడుగులు వేయటం ఖాయం అనేది స్పష్టమవుతుంది.