Heavy floods: పెదవాగు ప్రాజెక్టు‌కు భారీ గండి.. రాత్రికి రాత్రే ప్రాజెక్టు ఖాళీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి పెదవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది.

Update: 2024-07-19 05:58 GMT

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి పెదవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. గురువారం రికార్డు స్థాయిలో 109.3 మిల్లీమీటర్ల వర్షపాతానికి.. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చి చేరింది. అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి వరద ఉగ్రరూపం దాల్చి జలప్రళయం గా మారింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రాజెక్టు ఆనకట్టలు మీదుగా వరద నీరు పొంగి ప్రవహించింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని నిరవధికంగా విడుదల చేస్తున్న ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రాత్రికి ప్రాజెక్టుకు ఆనకట్టలు తెగిపోయే పరిస్థితులు ప్రమాదకర ఏర్పడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు దిగువ గ్రామాలలోని ప్రజలను ఖాళీ చేయించారు.

అర్ధరాత్రి పెద్దవాగు ప్రాజెక్టు కుడి వైపు తుముకి భారీ గండిపడి ఆనకట్ట వరదలో కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయిపోయింది. దీంతో దిగువున ఉన్న వందలాది పొలాలన్నీ వాగులుగా మారగా.. పలు గ్రామాలు జలమయమయ్యాయి. 41 సంవత్సరాలుగా 15 వేల ఎకరాల ఆయకట్టు సాగుకు నీరు అందించిన ప్రాజెక్టు గండిపడి నిరుపయోగంగా మారింది. దీంతో ప్రాజెక్టు ఆధారిత రైతాంగం భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. ప్రాజెక్టు అయకట్టలో రెండు వేల ఎకరాలు తెలంగాణలో.. 13 వేల ఎకరాల భూభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్ర పునర్విభజన తర్వాత ప్రాజెక్టు నిర్వహణ మరమ్మతులలో నిర్లక్ష్యం జరిగింది. ఇటీవల ఆరు నెలల క్రితం రూ. 2 కోట్లతో మరమ్మతులు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

Tags:    

Similar News