ఎన్టీఆర్‌తో మంత్రి పువ్వాడ భేటీ.. ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రావాలని ఆహ్వానం!
ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి.
దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి విగ్రహావిష్కరణ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లుపై చర్చించారు.
మే 28న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు.
రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.