Mission Bhagiratha:మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం..ప్రజా ఆరోగ్యం పట్టని అధికారులు
ప్రజారోగ్యం కాపాడేందుకు కల్తీ లేని,స్వచ్ఛమైన తాగు నీరు
దిశ,తిరుమలాయపాలెం: ప్రజారోగ్యం కాపాడేందుకు కల్తీ లేని,స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు గత ప్రభుత్వం, యుద్ధ ప్రతిపాదకన భగీరథ కనెక్షన్ ఏర్పాటు చేసింది. ఇంటింటికి మిషన్ భగీరథ కనెక్షన్ ఏర్పాటు చేయడంలో ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. ప్రజా ఆరోగ్యాలతో చెలగాటం ఆడే విధంగా తిరుమలాయపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని కొమ్ము బిక్షం,గుగ్గిళ్ల గురవయ్య,గుగ్గిళ్ల బాలయ్య,కొమ్ము సత్యం,కొమ్ము వెంకన్న,వేమూరి ప్రసాద్ ఇండ్లకు ఇచ్చిన మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ఏకంగా సైడ్ డ్రైనేజీలో వేసి,అందులో నుంచే కనెక్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
సైడ్ డ్రైనేజీ లో వేసిన మిషన్ భగీరథ వాటర్ లైన్ కు ఇచ్చిన కనెక్షన్ ద్వారా వచ్చే నీరు, తాగితే జబ్బుల బారిన పడతామని, ఆ ప్రాంత కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఓ వైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుంటే, ఆ వర్షాలకు సీజనల్ వ్యాదులు డెంగ్యూ, మల్లెరియా,విషజ్వరాలు ప్రజలు అనారోగ్యాలతో బాదపడుతుండంగా..ప్రజారోగ్యం కాపాడాల్సిన అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీటీ, సీసీ రోడ్లును సైతం డ్రిల్స్ వేసి,గాడిల ద్వారా మిషన్ భగీరథ పైప్ లైన్లు ఏర్పాటు చేస్తే తమ ప్రాంతంలో మాత్రం అధికారులు సైడ్ డ్రైనేజీలో పైప్ లైన్లు ఏర్పాటు చేసి వెళ్లిపోయారని,ఇకనైనా సైడ్ డ్రైనేజీలో మిషన్ భగీరథ పైపులు తీసి,సీసీ రోడ్డు పై గాడి తొవ్వి నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.