Minister : సంకల్పం మంచిదైతే తోడ్పాటు లభిస్తుంది
సంకల్పం మంచిదైతే సమాజ తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
దిశ, ఖమ్మం రూరల్ : సంకల్పం మంచిదైతే సమాజ తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పోలెపల్లి పంచాయతీ పరిధిలోని గురుదక్షిణ ఫౌండేషన్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరుకూరి కాశయ్య, ఎస్వీ నారాయణ విగ్రహాలను మంత్రి తుమ్మల, వ్యవస్థాపకులు దుగ్గినేని సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడారు. గురుదక్షిణ ఫౌండేషన్ వారు తీసుకున్న సంకల్పం మంచిది కాబట్టే అన్ని పక్షాల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు.
ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తున్న సంస్థకు తమలాంటి వారు సహాయం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో తమ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. సంస్థ భూముల హద్దులను ఏర్పాటు చేసి ఆక్రమణకు గురికాకుండా చూడాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ కు సూచించారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రజల కష్టా, సుఖలలో పాలు పంచుకుంటున్న ఇటువంటి సంస్థలకు తోడ్పాటును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలపై ఉందన్నారు.
కాశయ్య, ఎస్ వీ నారాయణ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అనంతరం ఎస్వీ నారాయణ కుమారుడు డాక్టర్ జతిన్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గా ప్రసాద్, నాయకులు కృష్ణ ప్రసాద్, ఖమ్మం మేయర్ నీరజ, గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చావా సత్యనారాయణ, సెక్రటరీ ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాధు రమేష్ రెడ్డి పాల్గొన్నారు.