గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు

గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలని, ఆ దేవాలయాలపై ఆధారపడి చదువులు సాగించిన వారి జీవితాలు సుందరమయంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభిప్రాయపడ్డారు.

Update: 2024-11-14 11:08 GMT

దిశ, కొత్తగూడెం : గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలని, ఆ దేవాలయాలపై ఆధారపడి చదువులు సాగించిన వారి జీవితాలు సుందరమయంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభిప్రాయపడ్డారు. గురువారం స్థానిక జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి దేవి, గ్రంథాలయాల పితామహుడు ఎస్ఆర్ రంగరాజన్, నెహ్రూ చిత్రపటాలకు పూల మాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానభాండాగారాలని చెప్పారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఉత్సాహ భరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాలని సూచించారు.

    ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుండి పెద్ద ఎత్తున చిన్నారులు హాజరు కావడం అభినందనీయమని, వారంతా వుస్తకాల విలువను తెలుసుకోవాలని, వుస్తక వఠనం ద్వారా జీవన విధానం, బతుకు చిత్రం మారుతుందని చెప్పారు. చదువొక్కటే మనిషి మనుగడను మార్పు చేస్తుందని తెలిపారు. వుస్తకాల్లోని తెల్లని కాగితాల్లో ఉండే అక్షరాలను సాధారణంగా లెక్క పెట్టక, ఆకాశంలోని నక్షత్రాల వంటి వెలుగు చుక్కలుగా చూడాలని, ఆ అక్షర నక్షత్రాలే తలరాతలను మార్చి జీవితాలను వెలిగిస్తాయన్నారు. పిల్లలు చదువుల్లో పోటీతత్వం, ఆలోచన శక్తి పెరిగే విధంగా మార్పు తెచ్చేందుకు ఈ వేదిక ద్వారా ప్రయత్నించాలని సూచించారు.

    వారోత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పట్ల అయన సంతృప్తి వ్యక్తం చేశారు.వేదికతో పాటు వీక్షకులకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు సిబ్బంది కృషి చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం వివిధ పాఠశాలల నుండి వచ్చిన చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనను చూసిన కలెక్టర్ వారిని అభినందిస్తూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని, అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి, గ్రంథాలయ ఆఫీస్ ఇన్​చార్జ్ ఎం.నవీన్ కుమార్, గ్రంథ పాలకురాలు జి.మణి మృధుల, జిల్లాలోని గ్రంథపాలకులు మధు బాబు, వంశీ, జాని, వాణి, రుక్మిణి, గీత పాల్గొన్నారు. 


Similar News