కబ్జాల పై కొరడా ఝులిపించిన ఖమ్మం కార్పొరేషన్ అధికారులు

ఖమ్మం నగరంలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కవి

Update: 2024-09-09 15:09 GMT

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరంలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కవి రాజు నగర్, మమతా రోడ్, వైరా రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన కమిషనర్ కబ్జాలపై కొరడా జులిపించారు. దీనిలో భాగంగా సోమవారం న్యూ విజన్ పాఠశాల ప్రాంతంలో సుమారు 100 అడుగులు ఉన్న సాగర్ కాలవను కొంతమంది ఆక్రమించి స్థలాలు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని స్వయంగా కమిషనర్ అక్కడికి చేరుకుని పరిశీలించిన ఆయన వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వాటిని తొలగించారు. అదేవిధంగా ఆ కాలవను సైతం విస్తీర్ణం పెంచి నీటిని సాఫీగా వెళ్లే విధంగా వైరా రోడ్డు మీదుగా లకారం ట్యాంక్ బండ్ పక్కన ఉన్న కాలవను సైతం విస్తీర్ణం పెంచుతూ వెళ్లడంతో కాలనీలో నిల్వ ఉన్న నీరు బయటకు వెళ్ళడం జరిగింది. అంతేకాక నాగార్జున ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఐస్ ఫ్యాక్టరీ ని సైతం నగరపాలక సంస్థ అధికారులు కూల్చి వేశారు. ఇవేగాక ఖమ్మం నగరంలో ఇంకా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి కూల్చి వేయడం జరుగుతుందన్నారు.

ఇదే క్రమంలో ఖమ్మంలో చెరువు ప్రాంతంలో ఉన్న కబ్జాలను కూడా తొలగిస్తే కానీ రాబోవు రోజుల్లో ఇలాంటి వరద పరిస్థితులు తలెత్తవని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ప్రధాన నేతల అనుచరులు పెద్ద ఎత్తున కబ్జాలు చేసి సొమ్ము చేసుకోవడమే కాక కాలువలు, చెరువులను వదలకుండా ఎక్కడికక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారు పార్టీ కండువాలు మార్చుకొని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనివల్ల అధికార పార్టీపై ఒత్తిళ్లు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు అలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కబ్జాలను అడ్డుకుంటారా లేదా అని వేచి చూడాల్సిందే.

కమిషనర్ అభిషేక్ అగస్త్య....

ఖమ్మం నగరంలో తనకొచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు మూడు చోట్ల జరిగిన కబ్జాలను తొలగించినట్టు తెలిపారు. ఇవే కాక మరికొన్ని ఫిర్యాదులు వచ్చాయి అని వాటిని కూడా పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.న్యూ విజన్ పాఠశాల భావన నిర్మాణం పై అభ్యంతరాలు వచ్చాయి అని ఆ పక్కనే ఉన్న మరో భవనం కూడా ఎఫ్ టి ఎల్ ఉన్నట్లు తెలిసిందని వారికి కూడా నోటీసులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ విధంగా అక్రమాలకు పాల్పడిన యజమానులపై వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మేయర్ పునుకొల్లు నీరజ....

మాట్లాడుతూ ఖమ్మం నగరంలో జరిగిన కబ్జాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న తాము అడ్డురామని స్పష్టం చేశారు. అదేవిధంగా కబ్జాల కారణంగా మొన్న జరిగిన విపత్తు పూడ్చు కోలేనిది అన్నారు. ఈ తొమ్మిది రోజులుగా వరద ముంపు ప్రాంతాల్లో తిరగడం వల్ల వారి పాడిన బాధలు ప్రత్యక్షంగా చూశ అన్నారు. ఈ కబ్జాలను వెలికి తీసే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్, ల్యాండ్ సర్వే, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల బాధ్యతేనని వారి పని వారు చేసుకుంటూ పోతారని కాలువలను చెరువులను కబ్జా చేసిన వారు ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.


Similar News