ఎన్ఎస్పీ ఏఈ ఆఫీస్ ఏన్కూర్ లో ఉన్నట్లా ? లేనట్లా ?

మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ కాలువ నిర్మాణం జరిపే సమయంలో ఏర్పాటు చేసిన ఎన్ఎస్పీ ఏఈ కార్యాలయం తాళాలను గత కొన్ని సంవత్సరాలుగా తీసే నాథుడు లేక శిథిలావస్థకు చేరింది.

Update: 2025-03-18 03:42 GMT

దిశ, ఏన్కూరు : మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ కాలువ నిర్మాణం జరిపే సమయంలో ఏర్పాటు చేసిన ఎన్ఎస్పీ ఏఈ కార్యాలయం తాళాలను గత కొన్ని సంవత్సరాలుగా తీసే నాథుడు లేక శిథిలావస్థకు చేరింది. అసలు ఏన్కూర్ లో ఎన్ఎస్పీ ఏఈ కార్యాలయం ఉందా, లేక గోప్యంగా ఎక్కడకి అయినా తరలించారా అనే విషయం రైతులకు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఏన్కూరు మండలంలో తిమ్మారావుపేట నుండి లోకారం వరకు సుమారు 3500 సాగర్ ఆయకట్టు కింద వరి పంట సాగు జరుగుతుంది. సాగర్ జలాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఆగిపోతాయి అనే విషయం, సంబంధిత ఇంజనీర్లకే తెలుసు. రైతులకు ఉన్న సందేహాలు తెలుసుకోవాలంటే ఏఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

కానీ ప్రస్తుతం ఈ ఆఫీసు తాళాలు తీసే నాథుడు లేక, ఎవరిని అడగాలో తెలియక రైతులు వెను తిరిగిపోతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాలు వారాబంధి నడుస్తున్న సమయంలో రైతులకు పలు సందేహాలు ఉండటం, వాటిని నివృత్తి చేసేందుకు స్థానికంగా ఎన్ఎస్పీ అధికారులు లేకపోవడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తుంది. గతంలో ఒక ఏఈ, నలుగురు వర్క్ ఇన్స్పెక్టర్లు, పది మంది లస్కర్లతో కళకళలాడిన ఆఫీసు నేడు శిథిలావస్థకు చేరి పాడుపడ్డ భవనంగా కనబడుతుంది. కల్లూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఈ ఆఫీసు, రైతులకు వచ్చే సందేహాలను తీర్చే అందుకుగాను ఇక్కడ ఏఈ పోస్ట్ ను కన్వీనియంట్ గా ఉండే విధంగా జిల్లా సాగర్ కెనాల్ ఎస్ ఇ చర్యలు చేపట్టాలని, శిథిలావస్థకు చేరిన భవనం తొలగించి కొత్త భవనాన్ని నిర్మాణం జరపాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.


Similar News