రహదారి పక్కన కనపడని ఊరి పేర్ల బోర్డులు..
తన సొంత స్థలంలో చిన్న గుంజ పాతిన తీయండి అని ఘర్షణకు దిగే ఈ రోజుల్లో.. మన సొమ్ము ఏమి పోయింది, మన ఉద్యోగానికి డోకా లేదు, మన స్థలం కాదుగా అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆర్ అండ్ బీ శాఖ అధికారులు.

దిశ, ఏన్కూర్ : తన సొంత స్థలంలో చిన్న గుంజ పాతిన తీయండి అని ఘర్షణకు దిగే ఈ రోజుల్లో.. మన సొమ్ము ఏమి పోయింది, మన ఉద్యోగానికి డోకా లేదు, మన స్థలం కాదుగా అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆర్ అండ్ బీ శాఖ అధికారులు. ఎప్పుడు మంత్రి వచ్చినప్పుడు, వీఐపీ స్థాయి అధికారులు వస్తే తప్ప ఆర్ అండ్ బీ అధికారులు ఏనుకూరు మండల కేంద్రంలో కూడా కన్నెత్తి చూడరు. వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల, ఆర్ అండ్ బీ స్థలాల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయి వ్యాపార సంస్థలు సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ఉచితంగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఆర్ అండ్ బీ అధికారులతో మీలాఖత్ ఏర్పాటు చేశారా లేదా, కార్పొరేట్ సంస్థలు సొంతంగా ఏర్పాటు చేశారా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఊరు పేరు కనపడని గ్రామాలు..
ఆర్ అండ్ బీ అధికారులు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం ముందు నేమ్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, తమకేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరించడం వల్ల కార్లలో ఇతర వాహనాల్లో ప్రయాణం చేసే వారికి గ్రామాల బోర్లు లేకపోవడంతో పేరు తెలియక తికమక పడుతున్నారు. ఉన్న బోర్డులు స్పష్టంగా కనపడకుండా చెట్లు కొమ్ములు అడ్డం రావడం, భూమికి అడుగు ఎత్తు భాగంలో ఉండటం ప్రయాణికులును ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నూతనంగా రోడ్లు నిర్మాణం జరిపే అప్పుడు దగ్గరుండి విధులు నిర్వహించే ఆర్ అండ్ బీ అధికారులు, మండల కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రోడ్డు నిర్మాణాలు జరిగితే పర్సంటేజీలు వస్తాయి కాబట్టి బాధ్యతగా వ్యవహరిస్తారని, చిన్న చిన్న పనులకు ముడుపులు ఏమి అందవు కాబట్టి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో డీఈ, జేఈ, కనుసన్నలలో విధులు నిర్వహించవలసిన వర్క్ ఇన్స్పెక్టర్లు, గ్యాంగ్ మ్యాన్లు చుట్టూ చూపుకు కూడా కనపడకపోవడం ఆశ్చర్యం, ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు కళ్ళు తెరిచి గ్రామాలు ఊరు పేర్లు కనబడే విధంగా నూతన బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టే విధంగా కార్పొరేట్ సంస్థలు బోర్డులు తొలగించడమా ఆదాయ వనరులు సమకూర్చడం అనేది తెలుసుకోవాలని ఆర్ అండ్ బీ అధికారులకు స్థానికులు సూచిస్తున్నారు.