నూతన కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి

ఖమ్మం నగరంలో విలీనమైన, నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Update: 2024-12-03 10:52 GMT

దిశ, ఖమ్మం : ఖమ్మం నగరంలో విలీనమైన, నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి, ఖమ్మం మున్సిపల్ పరిధిలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ కాలనీలో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.4 కోట్ల 10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ కాలనీ ప్రజల అభ్యర్థన మేరకు ఈనాడు కార్యాలయం వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్, బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మంత్రి ఖమ్మం ఆర్టీసీ అధికారులను ఫోన్​లో ఆదేశించారు. ఎస్ఆర్ గార్డెన్స్ నుంచి వైఎస్ఆర్ నగర్ కాలనీ వైపు నుండి మండలానికి వెళ్లే రోడ్డులో బస్సులు లేక పాఠశాల విద్యార్థినులు, మహిళలకు ఇబ్బంది ఉన్నందున ప్రత్యేకంగా బస్సు వేయాలని మంత్రి సూచించారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఇండ్లు నిర్మించుకున్న పేదల కాలనీలు, నగరంలో నూతనంగా విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, దానిని నిలబెట్టే దిశగా ముఖ్యమంత్రితో చర్చించి ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు తెచ్చామని అన్నారు. వైఎస్సార్ కాలనీలో ప్రజలకు ఉన్న విద్యుత్ కనెక్షన్ల సమస్య పరిష్కరించాలని, మున్సిపల్ అధికారులు సక్రమమైన ఇండ్లకు ఇంటి నెంబర్ వెంటనే కేటాయించాలని మంత్రి సూచించారు.

     గత 5 సంవత్సరాల కాలంలో అనేక అరాచకాలు జరిగాయని, వీటిని విచారించి న్యాయంగా ఉన్న వారికి తప్పనిసరిగా వసతులు కల్పించాలని అన్నారు. అనంతరం సీఎం కప్ క్రీడా పోటీల బ్రోచర్, లోగో లను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఆర్డీఓ నరసింహారావు, 8వ డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కొత్తపల్లి నీరజ, జిల్లా యువజన, క్రీడా సంక్షేమ శాఖ అధికారి సునీల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News