కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి

కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి చెందుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

Update: 2024-12-04 11:22 GMT

దిశ,కరకగూడెం : కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి చెందుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కరకగూడెం మెయిన్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వారి కార్యకర్తలకు, అనర్హులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నట్టు తెలిపారు.

    రేవంత్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ డ్వాక్రా సంఘాల ద్వారా వారికి డబ్బులు విడుదల చేశారని, మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, అప్పుల కుప్పగా మార్చిందన్నారు. గత పదేండ్ల లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలలో ఉచిత ఎరువులు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేయలేక పోయిందో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ధరణి పేరుతో రాష్ట్రంలో ఉన్న భూములన్నీ బీఆర్ఎస్ నాయకులకు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో, క్వింటా కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్టు చెప్పారు. వచ్చే కొత్త సంవత్సరంలో పులుసు బొంత ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.

    కరకగూడెం మండలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేదన్నారు. ఇప్పుడున్న విద్యుత్ సబ్ స్టేషన్ , ప్రభుత్వ ఆసుపత్రి, కరకగూడెం మండల ఏర్పాటు ఇవన్నీ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినవే అన్నారు. ప్రజలు తనను నేరుగా కలవచ్చు అని పేర్కొన్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి మండలంలోని 16 పంచాయతీలకు గాను 16 స్థానాలలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు యర్ర సురేష్, పోలేబోయిన తిరుపతయ్య, శ్రీవాణి, తొలేం నాగేశ్వరావు, జలగం క్రిష్ణ, గోగ్గలి రవి, సాగర్, రాందాస్, పూజారి వెంకన్న, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. 


Similar News