ఇండ్ల లబ్ధిదారుల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి
డిసెంబర్ 5 సాయంత్రంలోగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను జిల్లాలోని అన్ని తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు.
దిశ, కొత్తగూడెం : డిసెంబర్ 5 సాయంత్రంలోగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను జిల్లాలోని అన్ని తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, సమగ్ర ఇంటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియపై అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తో కలిసి జిల్లాలోని ఆర్డీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రూరల్ గ్రామాల్లో డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి అయిన వారు పూర్తి కానీ వారికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పాల్వంచలో డేటా ఎంట్రీ పూర్తి అయిన వెంటనే ములకలపల్లి డేటా ఎంట్రీ ప్రక్రియ కు సహాయం అందించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులను నిర్దేశిత ఫార్మేట్ ద్వారా పూర్తి చేయాలని, దరఖాస్తుతో పాటు దరఖాస్తుదారుడి ఫొటో, ప్రస్తుతం నివాసముంటున్న గృహం పొటో పొందుపరచాలన్నారు.
డిసెంబర్ 5 సాయంత్రంలోగా నిర్దేశిత ఏబీసీ లబ్ధిదారుల జాబితాను జిల్లాలోని అన్ని తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్టులో ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రదర్శించిన జాబితాలో అభ్యంతరాలు స్వీకరించటం కోసం గ్రామసభలు నిర్వహించాలని, గ్రామ సభలు వీలైతే గ్రామపంచాయతీ కార్యాలయం పరిధిలో లేదా గ్రామాల్లోని నిరుపేద అవసాల వద్ద నిర్వహించాలని కోరారు. గ్రామ సభలో ఎక్కడ నిర్వహించేది తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలన్నారు. గ్రామ సభలలో వచ్చిన అభ్యంతరాలపై సత్వరమే విచారణ చేపట్టి తగిన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.