జిల్లా అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం ఉండాలి

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధులు అందజేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు.

Update: 2024-11-20 11:34 GMT

దిశ, కొత్తగూడెం : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధులు అందజేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్ లో బుధవారం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, కోరం కనకయ్యలతో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సామాజిక, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తామన్నారు.

    ఇక్కడ ఉన్న సంస్థలు జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ ఫండ్స్ ను తమ వంతు బాధ్యతగా రెండు శాతం అందజేయాలని ఆయన కోరారు. గతంలో సీఎస్ఆర్ నిధుల కింద జిల్లాలో అన్ని నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులను విజయవంతంగా చేపట్టడం జరిగిందన్నారు. సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

     సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అవసరమైన పనులకు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, నవభారత్, బీటీపీఎస్ యాజమాన్యాలకు చెందిన ఉన్నతాధికారులు, జీఎం ఇండస్ట్రీస్ తిరుపతయ్య, సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. 


Similar News