పత్తిని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన..రహదారిపై రాస్తారోకో

ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉప మార్కెట్ యార్డులో వ్యాపారులు

Update: 2024-11-20 04:44 GMT

దిశ,జూలూరుపాడు: ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉప మార్కెట్ యార్డులో వ్యాపారులు బుధవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారుల తీరును నిరసిస్తూ, వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉప మార్కెట్ యార్డ్ సమీపంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు బైఠాయించి వారు ఆందోళన చేపట్టారు. మార్కెటింగ్ శాఖ అధికారులు తారం, క్యాష్ కటింగ్ చేయవద్దని వ్యాపారులకు ఆదేశించారు. అధికారుల నిబంధన లు తమకు శాపంగా మారాయని, తాము పత్తి కొనుగోలు చేయలేమని, మూడు శాతం క్యాష్ కటింగ్ అయితేనే తమకు గిట్టుబాటు అవుతుందని డిమాండ్ చేస్తూ వ్యాపారులు పత్తి కొనుగోలు నిలిపివేశారు.

వ్యాపారులతో ఏన్కూర్ మార్కెటింగ్ శాఖ సూపర్వైజర్ రామారావు, సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శులు యాసా నరేష్, గుండె పిన్ని వెంకటేశ్వర్లు లు చర్చలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి విక్రయించేందుకు ఉప మార్కెట్ యార్డ్ కు రైతులు పత్తిని తీసుకువచ్చారని, కొనుగోలు చేయకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని, పత్తిని కొనుగోలు చేయాలని వ్యాపారులను కోరారు. అయినప్పటికీ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పార్టీల నాయకులు, వ్యాపారులతో చర్చించారు.

మీ సమస్యను పరిష్కరిస్తామని ఆందోళన విరమించాలని వారికి సూచించారు. ట్రేడర్స్ వచ్చి పత్తిని కొనుగోలు చేస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులుపోలీసులకు తెలిపారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు కోనేరు సత్యనారాయణ రైతుల సమస్య ను భద్రాద్రి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఎండి అలీ దృష్టికి మార్కెటింగ్ సిబ్బంది రైతుల సమస్యను తీసుకువెళ్లారు. దీంతో ఆయన వ్యాపారులతో మాట్లాడి పాత పద్ధతిలోనే ఒక్కరోజు పత్తిని కొనుగోలు చేయాలని వ్యాపారులకు సూచించారు. మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి ఆలీ సూచన తో పత్తిని కొనుగోలు చేస్తామని వ్యాపారులు హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. గంటన్నర పాటు ఆందోళన చేయడంతో రహదారి కిరువైపులా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


Similar News