ఆర్యవైశ్య పెద్దల్లో మొదలైన కలవరం...

ఆర్యవైశ్య పెద్దలు అని చెప్పుకొని సంఘ ఆస్తుల ను సొంతానికి

Update: 2024-11-19 13:06 GMT

దిశ,ఖమ్మం సిటీ : ఆర్యవైశ్య పెద్దలు అని చెప్పుకొని సంఘ ఆస్తుల ను సొంతానికి వాడుకున్న వారిలో కలవరం మొదలైంది. దిశ ప్రచురించిన అంతర్గత కుమ్ములాటలు, వనభోజనాల వసూళ్లు పై ఆర్యవైశ్య మహాసభ సంఘాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఆర్యవైశ్య పెద్దలు కొందరు పేద వైశ్యుల కు అందాల్సిన సేవలను, అవసరాలను వారికి అందనీయకుండా చేసిన వారిపై గురుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్యవైశ్య అభ్యున్నతికి ఉపయోగపడాల్సిన ఆస్తులను కొందరు పెద్దలు వైట్ కాలర్ ముసుగులో వాటిని ఇష్టానికి వాడుకోవడమే కాక సొంత ఆస్తులుగా పెత్తనం చేస్తూ ఎవరికి కూడా వాటిపై వచ్చే ఆదాయం లెక్కలు గురించి తెలియనీయకుండా చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి.

ఈ మధ్యకాలంలో ఒకరిద్దరూ పెద్ద వ్యాపారవేత్తలు గా నగరంలో పేరు తెచ్చుకొని ప్రజల సొమ్మును దోచుకుని ఐపి దాఖలు చేసిన పరిస్థితి వెనుక ఈ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు విమర్శలు వినపడుతున్నాయి. ఒక ఐదుగురు జట్టుగా సుమారు 30 ,35 ఏళ్లు గా దోస్తీ చేస్తూ ఆర్యవైశ్య ఆస్తులను కాపాడుతూ వైశ్యులకు న్యాయం చేసేది తామే అన్నట్టు బీరాళ్ళు పోతూ ఇప్పుడు వాటిని కరిగిస్తున్నట్లు విమర్శలు ఊపందుకున్నాయి. ఈ పెద్దలను ఎవరు ఎప్పుడు ప్రశ్నిస్తారో అని లోన లోన కలవరం పడుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల విలువ చేసే ఆస్తులను పేద వైశ్యుల అవసరాలకు ఉపయోగించకుండా ఇంకా వారి వద్దనే ఉంచుకొని ఎలాంటి వడ్డీలు చెల్లించుకోకుండా సొంతానికి వాడుతూ వారి వ్యాపారులను మూడు పూలు ఆరు కాయలుగా నడుపుకుంటున్నారనేది బహిరంగంగానే చర్చ నడుస్తోంది.

కొన్నేళ్ల క్రితం చిన్న చిన్న వ్యాపారుల్లో ఉన్న వీరు మాల్స్, బ్యాంకులు, బిల్డర్లుగా, మరికొన్ని ప్రైవేటు సంస్థలకు చైర్మన్, అధ్యక్షుడు హోదాల్లో కీర్తి గడిస్తూ పూర్తిస్థాయిలో ఆర్యవైశ్య సోదరులపై సవితి ప్రేమ చూపిస్తున్నట్లు పేద వైశ్యులు మొర పెట్టుకుంటున్నారు. వైశ్యులకు వ్యాపారమే వృత్తి కాబట్టి కొంతమంది చిన్న , మధ్యతరగతి కుటుంబాలను ఎంచుకొని వారికి చిన్న మొత్తాల్లో డబ్బులు ఇచ్చి వడ్డీలు వసూలు చేస్తూ వాటి ద్వారా సేవలు చేస్తున్నామని డంబాలు పోతూ శోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తూ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఇదో మార్గంలా ఎంచుకున్నట్లు సంఘంలోని కొందరు పేర్కొంటున్నారు. ఆర్యవైశ్య ఆస్తుల్లో ఒక్కటైన సుగ్గల వారి తోటలో గల నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని కూడా సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

ఇప్పటివరకు కొన్ని ఏళ్లుగా ఆ భవనాన్ని కొంతమంది కుల పెద్దల చేతుల్లో పెట్టి రెంట్లు వసూలు చేస్తున్నమని చెబుతున్నారు తప్ప ఇప్పటివరకు దాని నుండి వచ్చిన ఆదాయంతో ఎక్కడైనా ఏమైనా జమ చేశారా లేదా లెక్కలు ఎవరికీ తెలియదంటే వారి అజమాయిషి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిని ప్రశ్నిస్తే వారిపై సొంత సైన్యంతో విమర్శలు గుప్పిస్తూ ప్రతి ఒక్కరు అడిగే వారేనా అన్న హెచ్చరికలు ఇప్పిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. వందలు వేలు ఖర్చు చేస్తూ లక్షల్లో లెక్కలు చూపుతూ ఆర్యవైశ్య సమాజాన్ని మోసం చేస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా ఆర్యవైశ్య పెద్దలు వైశ్య సంఘానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో వెల్లడించాలని వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొంతమంది పేద వైశ్యుల కైనా ఉపయోగపడితే చాలు అనేది కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.


Similar News