ట్రస్ట్ పేరిట హాంఫట్...నిత్యాన్నదానంతో నయవంచన..
కోడి కూయకముందే డబ్బు సంపాదనకు మేల్కొన్నారు కొంతమంది
దిశ ప్రతినిధి,కొత్తగూడెం: కోడి కూయకముందే డబ్బు సంపాదనకు మేల్కొన్నారు కొంతమంది మహానుభావులు. దశాబ్దాల క్రితం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నాలుగు దిక్కులలో ఎటువైపు చూసిన సింగరేణి స్థలాలు విశాలవంతంగా తారసపడేవి. కొంతమంది భవిష్యత్తును ముందే ఊహిస్తారో ఏమో కానీ కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను సేవ చేస్తామంటూ ట్రస్టుల పేరిట కాజేశారు. సింగరేణి నుండి సేవ చేస్తామని పొందిన స్థలంలో తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తూ కోట్ల రూపాయలకు పడగలు ఎత్తుతున్నారు.
ట్రస్ట్ పేరిట కోట్ల రూపాయల సింగరేణి స్థలాన్ని కాజేశారా.?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో దశాబ్దాల క్రితం హోమియోపతి మందులు పంపిణీ చేస్తాం, సింగరేణి కార్మికులకు అండగా ఉంటాం అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి కోట్ల రూపాయల విలువ చేసే సింగరేణి స్థలాన్ని చేజెక్కించుకున్న అనంతరం శారద కుటీర్ పేరుతో విద్యా వ్యాపారం మొదలుపెట్టారు. బడిలో చదువుతున్న 40 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని సింగరేణి ద్వారా ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఈ వ్యాపారస్తుల నిజ స్వరూపం బయటపెట్టారు. సంవత్సరాల తరబడి ప్రతి విద్యార్థి వద్దనుండి వేళల్లో వసూలు చేస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. తాము చెప్పిన 40 శాతం కాదు కదా నాలుగు శాతం పేద విద్యార్థులకు కూడా ఉచిత విద్య ఇవ్వకుండా ట్రస్ట్ పేరిట వ్యాపారం చేస్తున్నారు.
కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ఫీజుల వసూళ్లు..
శారద కుటీర్ పేరిట నడుస్తున్న ఈ పాఠశాల జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉండేసరికి ప్రతి ఏటా వందల సంఖ్యలో అడ్మిషన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఎల్కేజీ విద్యార్థి మొదలు పదవ తరగతి వరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేల రూపాయల అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. స్తోమత లేని పేదవారు ఫీజులు తగ్గించమని కాళ్ళ వేళ్ళ పడ్డ కనీసం కనికరం చూపరు. సరే ఇంత ఫీజులు వసూలు చేస్తున్నారు కదా నాణ్యమైన చదువు దొరుకుతుంది అంటే పప్పులో కాలు వేసినట్లే. కనీస అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తూ విద్య మాటన వ్యాపారం చేస్తున్నారని జిల్లా కేంద్రంలో చర్చ లేకపోలేదు.
నిత్యాన్నదానం పేరిట నయవంచన.. శ్రీ శారద శక్తి పీఠం పేరిట చేస్తున్న ఈ వ్యాపారం వెనుక అనేక కోణాలు దాగి ఉన్నాయని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రస్టు ద్వారా నిత్యం నిత్యాన్నదానం జరుపుతున్నామని పాఠశాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ ఈ ట్రస్టు ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరడం లేదు.
నిత్యాన్నదానం చేస్తున్నామని ఎన్ఆర్ఐ ల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారన్న పుకార్లు లేకపోలేదు. వాస్తవానికి నెలలో మూడు నాలుగు సార్లు కేవలం పది మందికి మాత్రమే నాణ్యతలేని అన్నం నీళ్ల సాంబార్ తో మామ అనిపిస్తున్నారని తెలుస్తోంది. శారద విద్యాలయం ద్వారా వచ్చిన కోట్ల రూపాయల ధనం ఎటు పోతుంది...? సేవ చేద్దామని స్థాపించిన ఈ ట్రస్ట్ సొంత వ్యాపారానికే ఉపయోగించుకుంటున్నారని తేటతెలమయ్య పరిస్థితి కనబడుతోంది. 40 శాతం పేద ప్రజలకు ఉచిత విద్య అందడం లేదు, నిత్యాన్నదానం అసలే కానరాదు, పైగా ప్రతి విద్యార్థి నుండి కార్పొరేట్ స్కూల్ లతో సమానంగా వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనితోపాటు స్కూల్ పై ఉన్న భవంతిని ప్రియదర్శిని కళాశాలకు అద్దకు ఇచ్చి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ ట్రస్టు ద్వారా వచ్చిన ఆదాయం అంతా ఎటు పోతుంది.? ఎవరికి ఖర్చు చేస్తున్నారు.? అన్న ప్రశ్నలకు అంతుచిక్కని సమాధానం ఎదురు చూస్తుందా.? ఈ వ్యాపారం వెనుక అసలు సూత్రధారులు త్వరలో బయట పడనున్నారా.?వేచి చూడక తప్పదు.