నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యుడి లొంగుబాటు
ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ బెటాలియన్
దిశ ప్రతినిధి,కొత్తగూడెం:ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ బెటాలియన్ దళ సభ్యుడు జిల్లా పోలీసు అధికారుల ఎదుట మంగళవారం లొంగిపోవడం జరిగింది. దళ సభ్యుడు మడివి అయిత మంగు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా జీలొరుగడ్డ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇతను 2020 జూన్ నెలలో చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన హిడ్మా నాయకత్వంలోని ఫస్ట్ బెటాలియన్లో దళసభ్యుడిగా భర్తీ కాబడి నేటి వరకు అదే దళంలో పనిచేస్తూ ఉన్నట్లుగా పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ బెటాలియన్ నాయకులు ఆదేశాల ప్రకారం ఇతర దళసభ్యులతో కలిసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు వివరించారు.
ఇటీవల బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తుండటంతో మావోయిస్టు పార్టీని వీడి పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా అనేకమంది మావోయిస్టు పార్టీ నాయకులు దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయి స్వేచ్ఛగా జీవిస్తుండటం పట్ల లొంగిపోయిన వ్యక్తి సంతృప్తి చెంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు. లొంగిపోయిన
దళసభ్యుడిపై రూ.లక్ష రివార్డు ఉందని చెప్పారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు సభ్యులు ఆయుధాలను వీడి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల హక్కుల తరఫున పోరాడాలని కోరుతున్నామని తెలిపారు. పోలీసుల ఎదుట లొంగిపోయి సాధారణ జీవితం గడపాలనుకునే వారు తమ బంధుమిత్రుల ద్వారా గానీ, స్థానిక పోలీసు అధికారుల ద్వారా గానీ, స్వయంగా జిల్లా ఎస్పీ ఎదుట గానీ లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతి ఫలాలను అందించి వారికి పునరావాసం కల్పిస్తామని ఎస్పీ రోహిత్ రాజ్ స్పష్టం చేశారు.